calender_icon.png 20 October, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్‌పోస్టుల్లో ఏసీబీ సోదాలు

20-10-2025 01:10:41 AM

ఏకకాలంలో తనిఖీలు 

పలుచోట్ల నగదు స్వాధీనం

బట్టబయలైన అక్రమ వసూళ్ల దందా!

విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 19: రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో శనివారం రాత్రి రాష్ర్ట వ్యాప్తంగా పలు చెక్‌పోస్టులపై ఏకకాలంలో మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని వేలాది రూపాయల నగదు బయటపడగా, సిబ్బంది అక్రమ వసూళ్ల బాగోతం బట్టబయలైంది.

గత కొంతకాలంగా సరిహద్దు చెక్‌పోస్టుల్లో, ముఖ్యంగా ప్రైవేటు సిబ్బందిని అడ్డుపెట్టుకుని వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూ లు చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, పక్కా ప్రణాళికతో ఏకకాలంలో దాడులు చేపట్టారు.

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఏసీబీ అధికారులు మొగుడంపల్లి మండలం మాడిగి చెరకుపల్లి శివారులో గల అంతరాష్ట్ర  చెక్‌పోస్టుపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో లెక్కతేలని రూ.42,300 నగ దు పట్టుబడింది. ఈ చెక్ పోస్ట్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లే వాహనాలు అధిక లోడుతో వెళ్తుండటంతో వారి  వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో ఏసీబీ దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఏసీబీ దాడులు నిర్వహించిన సమయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ డ్యూటీలో ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారని తెలిసింది. 

కామారెడ్డి జిల్లాలో 

కామారెడ్డి జిల్లాలోని చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ అధికారు లు శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తనిఖీలు చేపట్టారు. మద్నూర్ చెక్ పోస్ట్‌పై ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించగా ఓ ప్రైవేటు వ్యక్తి పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 36 వేల నగదు ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులు గా గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు.

పొందుర్తి చెక్ పోస్ట్ ఆదివారం తెల్లవారుజామున ఒంటి గం ట నుంచి మూడు గంటల వరకు  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ అఫ్రోజ్ వద్ద రూ.5వేల నగదును స్వాధీనం చేసుకున్నా రు. రూ.51,300 నగదును ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు వాహనాల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేస్తునట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, కొత్తగూ డెం, పాల్వంచ, ముత్తగూడెం చెక్ పోస్టులపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అనధికార నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం చెక్ పోస్ట్‌లు ఎత్తివేసినప్పటికి అనధి కారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెక్ పోస్టులు  నిర్వహిస్తూ రవాణాశాఖ  అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు  సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. 

ఆదిలాబాద్ జిల్లాలో

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు అంతరాష్ట్ర చెక్ పోస్టుల పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బోరజ్ మండలంలోని జాతీయ రహదారి 44పై ఉన్న  బోరజ్ చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. చెక్ పోస్ట్ లో సోదాలు నిర్వహించిన అధికారులు రికార్డు లను, కంప్యూటర్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలో బోరజ్ చెక్ పోస్టులో ఎలాంటి లెక్కతేలని రూ.1,26,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి రాష్ట్ర సరిహద్దులోని చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.