20-10-2025 02:03:56 AM
లేకపోతే మీ గుట్టు బయటపడుతోంది
రాష్ట్ర నేతలకు కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యం పేరుతో కొందరు నాయకులు మావోయిస్టు దళాల నెట్‌వర్క్ కు మద్దతు ఇస్తున్నారని, వెంటనే ఆ సంబంధాలను తెంచుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వెళ్లాడని ఆయన అనుచరుడు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఓ జాతీయ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని పోస్టు చేశారు.
“రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ...మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా ఇదే మా హెచ్చరిక. సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోండి. లేనిపక్షంలో మీ గుట్టు బయటపడుతుంది. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టు నిర్మూలనకే పరిమితం కావడం లేదు. అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాల నెట్‌వర్క్‌ను సైతం వెలికి తీస్తున్నాయి.
దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు. కరుణ లేకుండా కఠిన చర్యలు తీసుకోబోతున్నాయి. అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదు. తప్పువైపు నిలబడే వారెవరైనా సరే పడిపోక తప్పదు” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ట్వీట్ చేశారు.