calender_icon.png 20 October, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీరింగ్ ఫీజులు ఫైనల్!

20-10-2025 01:02:51 AM

  1. కొన్ని కాలేజీలకు కోత.. మరికొన్నింటికి పెంపు
  2. పెరుగుదల 10నుంచి 20శాతమే..  
  3. ప్రభుత్వంపై భారం పడకుండా టీఏఎఫ్‌ఆర్‌సీ ఫీజుల ఖరారు  
  4. కొత్త ఫీజులకు సంబంధించి ఈవారంలో జీవో విడుదల

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ ఫీజుల అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. స్వల్ప మార్పులు.. చేర్పులు చేసి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఆ ఫీజులను ఖరారు చేసింది. కొన్ని కాలేజీల్లో ఫీజులకు కొత విధిస్తే..మరికొన్ని కాలేజీలకు పెంచినట్లు సమాచారం. కాలేజీల యాజమాన్యాలు అడిగినంత కాకుండా 10 నుంచి 20 శాతం వరకు ఫీజులను పెంచినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వంపై భారం పడకుండా ఫీజులు ఉండాలని  సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఆ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. ఈక్రమంలోనే శనివారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యా, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌తో భేటీ అయి, ఫీజులు ఖరారు అంశంపై చర్చించినట్లుగా తెలిసింది.

కొన్ని కాలేజీలకు ఫీజులు భారీగా పెంచడం, మరికొన్ని కాలేజీలకు పెంచాల్సిన దానికంటే తక్కువగా నిర్ధారించడం లాంటి అంశాలు సీఎం దృష్టికి రావడంతో అధికారులతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌తో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ వారంలో ఉత్తర్వులు జారీ...

ఫీజుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ఫీజులను ఖరారు చేయాలని గతంలో ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసి ఆరు వారాలపాటు గడువిచ్చింది. ఈ గడువు కూడా ముగిసిపోయింది. కానీ ఫీజుల అంశం నేటివరకూ తేలలేదు. మరోవైపు ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ పూర్తయి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. అయినా, ఫీజుల అంశం కొలిక్కి రాకపోవడంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే కొత్త ఫీజులు కొలిక్కి వచ్చేంత వరకూ పాత ఫీజులే అమలవుతాయని, వాటినే కాలేజీలు వసూలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనిప్రకారమే కాలేజీలు ఈసారి విద్యార్థులతో పాత ఫీజులనే కట్టించుకున్నారు. ఒకవేళ కొత్త ఫీజులు అమల్లోకి వస్తే పాత ఫీజులు పోను ఎంత ఉంటే అంత విద్యార్థులు కాలేజీలకు కట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ తగ్గితే కాలేజీలే విద్యార్థులకు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజులకు సంబంధించి నివేదిక ప్రభుత్వానికి ఇప్పటికే చేరింది. ఇంజనీరింగ్ ఫీజులు ఫైనల్ కావడంతో ప్రభుత్వం ఈ వారంలో ఎప్పుడైనా ఫీజులకు సంబంధించి జీవోను విడుదల చేయనుంది. 

రెండు సార్లు విచారణ

ఇంజినీరింగ్ ఫీజుల అంశం ఎట్టకేలకు చివరి దశకు చేరింది. ఇంజినీరింగ్ కాలేజీల హియరింగ్ (విచారణ) ప్రక్రియను టీఏఎఫ్‌ఆర్‌సీ రెండు సార్లు చేపట్టింది. తొలిసారి విచారణ జరిపినప్పుడు కాలేజీల్లో వసతులు ఉన్నయా? లేవా? మంచి ఫ్యాకల్టీ, ల్యాబ్‌లతో పాటు విద్యాప్రమాణాలు పాటిస్తున్నాయా? అనేది ఏదీ చూడకుండా యాజమాన్యాలు సమర్పించిన ఆడిట్ రిపోర్టు ఆధారంగా భారీగా ఫీజులు పెంచారని విమర్శలొచ్చాయి.

దీనిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోసారి హియరింగ్ నిర్వహించి కాలేజీను బట్టి ఫీజులను నిర్దిష్టంగా ఖరారు చేయాలని ఆదేశించింది. ఇందుకు గానూ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 3వరకు  రెండో సారి విచారణ చేపట్టింది. రోజుకు 10 నుంచి 20 కాలేజీలను పిలిచి గతంలో ఇచ్చిన ఆడిట్ రిపోర్టు నివేదికలపై వివరాలను అడిగి ఏఎప్‌ఆర్‌సీ తీసుకుంది.

ఇచ్చిన నివేదికలు సరైనవేనని కాలేజీల యాజమాన్యాల నుంచి అఫిడవిట్లు కూడా తీసుకుంది. ఒకవేళ అవి తప్పుడు లెక్కలని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అఫిడవిట్లు తీసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్ నెలాఖరులోనే ఫీజుల అంశం కొలిక్కి రావాల్సి ఉండేది. కానీ ఆలస్యమైంది. దీంతో త్వరితగతిన ఫీజులను ఖరారు చేయాలని అధికారులకు ఆదేశించడంతో ప్రస్తుతం కొలిక్కి వచ్చింది.

ఈవారంలో ఫీజులపై ప్రభుత్వం జీవో ఇచ్చే అవకాశముంది. ప్రతి మూడేళ్లకు ఓ సారి ఫీజులను ఖరారు చేస్తారు. గత బ్లాక్ పీరియడ్ 2022-23, 2023-24, 2024-25 సంబంధించిన గడువు ఈ విద్యాసంవత్సరంతో ముగిసింది. అయితే ఇప్పుడు తాజాగా ఖరారు చేసే కొత్త ఫీజులు 2025-26, 2026-27, 2027-28 వరకు వర్తిస్తాయి.