20-10-2025 01:06:23 AM
హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : కాంగ్రెస్ గెలుపునకు కారణాలు అనేకం కావచ్చు.. కానీ బీఆర్‌ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణం ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం దొరలకు చుట్టంగా మారిందని దానిని అడ్డుపెట్టుకుని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న దొరలకు ప్రజలు బుద్ధ్ది చెప్పారని తెలిపారు.
శిక్షణ పొందిన సర్వేయర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం శిల్పాకళా వేదికలో ధ్రువపత్రాలు అందజేసి మాట్లాడారు. భూ యజమానుల హక్కులను కాపాడి, వాటి హద్దులు నిర్ణయించే బాధ్యత సర్వేయర్లపైనే ఉందన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు.
సర్వేయర్లూ తప్పులు చేయొద్దు..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి నుంచి విముక్తి కలిగించి భూ భారతి తీసుకొచ్చామని పేర్కొన్నారు. సర్వేలో శిక్షణ పొందిన సర్వేయర్లు తప్పులు చేయవద్దని, అలా చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉందని సీఎం హెచ్చరించారు. రైతే దేశానికి వెన్నుముక అని, అలాంటి రైతుకు సర్వేయర్లు అండగా ఉండాలన్నారు. ‘రైతు రాజు కావాలంటే సర్వేయర్లు చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి.
రైతుకు ద్రోహం చేస్తే మన కుటుంబ సభ్యులకు అన్యానం చేసినట్లే. మీరంతా కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది’. అని చెప్పారు. ‘ఆ గురుతరమైన బాధ్యత మీ భుజస్కందాలపై పెట్టి గ్రామాలకు, తండాలకు పంపిస్తున్నాం’ అని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ యో గ్యమైన కోటి 60లక్షల ఎకరాల భూములు యజమానుల వద్ద ఉందని చెప్పారు. 140 సంవత్సరాలుగా వివిధ చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు కన్నత ల్లిపై ఎంత మమకారం చూపిస్తారో.. గ్రామంలో తమ భూ మి మీద అదే మమకారం చూపిస్తారని.. అందుకే ఆ భూ ముల సరిహద్దులను పరిరక్షించే బాధ్యత సర్వేయర్లపై పె ట్టామన్నారు. తెలంగాణ రైజింగ్ 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్‌గా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలంటే సర్వేయర్ల సహకారం ఉండాలన్నారు.
త్వరలో గ్రూప్ అభ్యర్థులకు నియామకపత్రాలు..
త్వరలోనే గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, కొన్ని ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని విమర్శించారు. ఒకవేళ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీలకు వాడే కాగితాల మాదిరిగా దొరికేవని సీఎం ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాగానే టీజీపీఎస్సీనీ పక్షాళన చేశామని, ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే కొందరు కోర్టులకు వెళ్లి ఆపాలని చూశారని మండిపడ్డారు. తాము కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశామని, నిరుద్యోగుల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు.
తప్పులను సరిదిద్దుతున్నాం : మంత్రి పొంగులేటి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి చట్టాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది రైతులను ఇబ్బందులకు గురి చేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శిచారు. గత పాలకులు చేసిన తప్పులను తమ ప్ర భుత్వం సరిదిద్దుతుందని తెలిపారు. అందులో భాగంగానే 3456 మంది సర్వేయర్లను నియమించి వారికి లైసెన్స్‌లు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. చిన్న అవకవతకలు కూడా జరగకుండా, ప్రజలకు వ్యతిరేకంగా పని చేయకుండా ప్రజా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్ధ్దితో పని చేయాలని సర్వేయర్లకు సూచించారు.