16-08-2024 12:51:01 AM
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 15: గ్రామాలు, పట్టణాలకు చెరువులు, కుంటలు జీవనాధారం. గ్రౌండ్ వాటర్ సరైన స్థాయిలో ఉంటేనే మనిషి మనుగడకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనికి కావాల్సింది నీటిని నిల్వ ఉంచే చెరువులు, కుంటలు. వాటిని కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంటే, కొంతమంది అధికారులు మాత్రం ప్రభుత్వ లక్ష్యాలను తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తున్నారు. భూ కబ్జాదారులు, రియల్ వ్యాపారులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లనే కాకుండా ఏకంగా చెరువులు, కుంటలను మింగేస్తుండగా, అధికారులు అక్రమార్కులకు వంతపాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ విభాగం అధికారులు అయినా స్పందించి నీటి వనరులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
యథేచ్ఛగా ఆక్రమణలు..
హైదరాబాద్ శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని చెరువులు, కుంటలు, వాగులు మాయమవుతున్నాయి. అక్రమార్కులు దర్జాగా కబ్జా చేసి మట్టితో పూడ్చి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. బఫర్ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనలు ఉన్నా అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తారామతిపేటలోని పోల్కమ్మ చెరువులో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎఫ్‌టీఎల్ నుంచి రోడ్డు వేసుకున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినా పటించుకోలేదు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలించి కంటి కంటితుడుపు చర్యగా రోడ్డును తొలగించారు. తర్వాత ఆ రియల్ వ్యాపారి తిరిగి రోడ్డు నిర్మించుకున్నా అధికారులు మళ్లీ పట్టించుకోలేదు. కంజోనికుంట లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తూము తొలగించి, ఎఫ్‌టీఎల్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. అదే విధంగా కొత్త చెరువులో కంకర మిషన్ ఏర్పాటు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
పెద్ద అంబర్‌పేట్ పరిధిలో..
ఈదుల చెరువు పెద్ద అంబర్‌పేట్ గ్రామానికి ఆనుకొని ఉంది. ఈ చెరువుపైన ఓ ప్రైవేట్ వెంచర్ ఉంది. వెంచర్‌కు వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. దీంతో చెరువు కాల్వపై అక్రమంగా రోడ్డు నిర్మిస్తున్న సమయంలో అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు స్వయంగా వచ్చి పరిశీలించారు. ఎఫ్‌టీఎల్‌లో మట్టిపోసిన విషయాన్ని ఇరిగేషన్ అధికారులు గుర్తించినా ఇప్పటివరకు తొలగించ లేదు. అదేవిధంగా కర్కనకుంట ఎఫ్‌టీఎల్ మొత్తం కబ్జాచేసి పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించుకున్నా ఇరిగేషన్ అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. పసుమాములలో రాం చెరువు చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ఎఫ్‌టీఎల్‌లో పార్కు స్థలాలు, ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. జవరగూడ చెరువును సైతం ఓ కాలేజీ వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేస్తున్నారు.
తట్టి అన్నారం గ్రామంలో ఊర చెరువును గతంలో అక్రమార్కులు కబ్జా చేసి అమ్మకాలు చేపట్టారు. స్థలాలను కొన్నవారు అక్కడ ఇళ్లు నిర్మించారు. అదేవిధంగా జంగారెడ్డి కుంట సర్వే నంబర్ 73లో జె కన్వెన్షన్ యాజమాన్యం కుంటను మట్టితో పూడ్చి ఫంక్షన్ హాల్ నిర్మించి, పార్కింగ్ స్థలంగా ఉపయోగించుకుంటుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. ఆర్కేనగర్ తట్టిఖాన చెరువును జీవీఆర్ కాలనీ, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు మట్టితో పూడ్చి ప్లాట్లు చేసి విక్రయించగా, ప్రస్తుతం ఇళ్లు నిర్మిస్తున్నారు.
హైడ్రా అధికారులైనా పట్టించుకునేనా?
కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను రక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా అధికారులైనా చెరువులు, కుంటలను కాపాడతారో చూడాల్సి ఉంది.