03-01-2026 12:00:00 AM
సంఘటితమైతేనే హక్కులు సాధించుకోగలం: జిల్లా అధ్యక్షులు రఘుబాబు
నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచ్‌లు వార్డు సభ్యులకు సన్మానం
నాగర్ కర్నూల్ జనవరి 2 (విజయక్రాంతి): శాలివాహనులు (కుమ్మరులు) ఆర్థికంగా, రాజకీయంగా బలపడాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఐక్యతగా ముందుకు రావాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో శాలివాహన కుమ్మర జిల్లా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ జీవితంలో మట్టి పాత్రల వినియోగం ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ప్లాస్టిక్ వినియోగం అధికమవుతున్న తరుణంలో ప్రజలు మళ్లీ మట్టి పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. మట్టినే నమ్ముకుని జీవిస్తున్న కుమ్మరులు తమ కులవృత్తిని కొనసాగిస్తూనే రాజకీయంగా, ఆర్థికంగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రఘుబాబు మాట్లాడుతూ, కుమ్మరులు సంఘటితంగా ఉంటేనే హక్కులు సాధించగలమన్నారు.
ఐక్యతే అభివృద్ధికి మూలమని, రాజకీయ పార్టీ నేతలపై ఒత్తిడి పెంచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక శాతం కుమ్మరులకు అవకాశం కల్పించేలా ఒత్తిడి తేవాలన్నారు. మన కులం వ్యక్తి అభ్యర్థిగా నిలుచున్న చోట పార్టీలకతీతంగా మన అభ్యర్థి గెలుపుకోసం సహకరించుకోవాలన్నారు. మనపై నమ్మకం ఉండి మనల్ని గెలిపించిన వారికి కుల మతాలకు అతీతంగా సేవాలాందించాలని జిల్లా గౌరవ అధ్యక్షులు చందుబట్ల వెంకటయ్య అన్నారు. మనుషులంతా ఒక్కటే అనే దోరనితో ప్రజలకు సేవలందించినప్పుడే గ్రామస్థాయి నుండి పార్లమెంట్ వరకు కొనసాగే అవకాశం ఉంటుందన్నారు.
భవిష్యత్తులో సమాజ అభ్యున్నతి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుమ్మరులు జిల్లాలో సంఖ్యా బలం అధికంగా ఉన్నప్పటికీ సమానమైన గుర్తింపు పొందలేక పోతున్నాం. అందుకు ప్రధాన కారణం ఐక్యత లోపమేనని జిల్లా సంఘం ముఖ్య సలహాదారు గుండూర్ శ్యామ్ అన్నారు. ప్రతి మూడు, ఆరు నెలలకు సమావేశాలు జరిపి సంఖ్యా బలాన్ని చూపాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ ఏపీడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మధునాగుల సుల్తాన్, బొడ్డుపల్లి జంగయ్య మాజీ ఎంపిటిసి రాజేశ్వరి, నూతన సర్పంచులు సూగూరి శ్రీనివాసులు, వాసుదేవుడు, ఉప సర్పంచ్ మధు నాగుల సుధాకర్, బొడ్డుపల్లి శాంతయ్య తదితర 27 మంది నూతన వార్డు సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు, ఆయా తాలూకా సంఘం బాధ్యులు ఉన్నారు.