25-10-2025 06:04:13 PM
నిర్మల్: ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాను పకడ్బందిగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినట్టు రెవెన్యూ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) ఓటర్ల జాబితాను ఖచ్చితత్వంతో, పకడ్బందిగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచనలు చేసినట్టు తెలిపారు. శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఐఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2002లో రూపొందించిన ఎస్ఐఆర్ జాబితాను 2025 ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్–2002, ఎస్ఎస్ఆర్–2025 లింకేజీ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల సహకారంతో క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన ధృవీకరణ చేపట్టాలని అన్నారు.
ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్ఐఆర్ డేటాను 2025 ఎస్ఎస్ఆర్ డేటాతో సరిపోల్చి, రెండింటిలోనూ ఉన్న పేర్లను మినహాయించి, 2002 తర్వాత కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలను భౌతికంగా మరోసారి ధృవీకరించాలని ఆయన సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓలు, డిప్యూటీ తహసిల్దారులు, బిఎల్ఓ సూపర్వైజర్లతో నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహించాలని, ప్రతిరోజు లక్ష్యాలను నిర్ణయించి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పద్ధతిగా అమలు చేయాలని సూచించారు. కేటగిరీ–‘ఏ’లోని వివరాలను నిర్ధారించి, ‘సి’, ‘డి’ కేటగిరీ వివరాలతో అనుసంధానం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సర్ఫరాజ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.