31-01-2026 07:49:00 PM
మెదక్,(విజయక్రాంతి): రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న జరగబోయే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం శనివారం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం అన్నారు.
ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ రోజుకు ఒక రోజు ముందు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకొని పోలింగ్ నిర్వహణకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్లతో కూడిన ఇతర పోలింగ్ సామాగ్రిని సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద సేకరించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా సరిచూసుకోవాలన్నారు. జోనల్ అధికారి పోలీస్ ఎస్కార్ట్ తోపాటు సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి పోలింగ్ కేంద్రంలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలనీ, ఓటరు రహస్యంగా తన ఓటు నమోదు చేసే విధంగా గదిలో ఒక మూలన ఓటింగ్ కంపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలన్నారు.
పోలింగ్ రోజున ఉదయం 6:30 కు పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ను సీల్ చేసి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించాలనీ, పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి తో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించడం జరుగుతుంది అని అన్నారు. ఓటర్లు తప్పనిసరిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకు రావాలి అన్నారు. ఓటరు గుర్తింపు నిర్ధారించుకున్న వెంటనే రెండవ పోలింగ్ అధికారి ఆ ఓటర్ యొక్క ఎడమచేతు చూపుడు వేలుకు చెరగని సిరాతో మార్క్ చేయాలని,
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తయిన వెంటనే పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ను సీలు వేసీ బ్యాలెట్ బాక్స్ ను ఇతర పేపర్లన్నింటినీ సాధ్యమైనంత త్వరగా జోనల్ అధికారి, పోలీస్ ఎస్కార్ట్ సమక్షంలో రిసెప్షన్ సెంటర్లో అందజేయాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనకు లోబడి ఎన్నికల సిబ్బంది పనిచేయాలన్నారు. ఎన్నికల మాస్టర్ శిక్షకులు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికల విధులు ప్రిసైడింగ్ అధికారి నింపవలసిన ఫారాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.