ఐఎస్‌సీఎం 2.0లో ప్రాధాన్యమివ్వాలి
కేంద్రానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌సీఎం) 2.0లో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.
చిప్ డిజైన్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో హైదరాబాద్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులకు తెలంగాణ సహజ ఎంపిక కావాలని పేర్కొన్నారు. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన ‘రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్’లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని తెలంగాణ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఎదిగిన తీరును వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూల విధానాలు, వ్యాపార సౌలభ్యం కారణంగానే హైదరాబాద్ జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారిందన్నారు.
ప్రపంచంలోని ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ సంస్థలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా ఎదిగిందని, చిప్ డిజైన్, కృత్రిమ మేధ(ఏఐ), సైబర్ సెక్యూరిటీ, అధునాతన ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వేలాది మంది నిపుణులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సెమీ కండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు తగిన ప్రాధాన్యం కల్పించి, చిప్ తయారీ పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.






