calender_icon.png 9 October, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో ప్రచార ప్రకటనలపై నిఘా

09-10-2025 12:37:16 AM

  1. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రతి ప్రకటనకూ ముందస్తు అనుమతి తప్పనిసరి
  2. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మీడియా సెంటర్ ప్రారంభం
  3. జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రచార ప్రకటనలపై ఎన్నికల సంఘం నిఘా ఉంచనుంది. పార్టీ లు, అభ్యర్థులు చేపట్టే ప్రచార హోరులో నిబంధనల ఉల్లంఘన జరగకుండా కట్టడి చేసేందుకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సీపీఆర్వో విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, మీడియా కేం ద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్ టీవీలు, సోషల్ మీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మొదలైనవి, ఈ-పేపర్లు, రేడియో, బల్క్ ఎస్సెమ్మెస్‌లు, ఇతర ఆన్‌లైన్ మాధ్యమాల్లో ఇచ్చే ప్రతి రాజకీయ ప్రకటనకు ఎంసీఎంసీ కమిటీ నుంచి తప్పనిసరిగా ప్రీ-సర్టిఫికేషన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ప్రకటనలు జారీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

డీఈవో చైర్మన్‌గా కమిటీ

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ చైర్మన్‌గా ఎంసీఎంసీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జీహెచ్‌ఎంసీ పౌర సంబంధాల అధికారి మామిం డ్ల దశరథం మెంబర్ సెక్రటరీగా వ్యవహరించను న్నారు. సభ్యులుగా సికింద్రాబాద్ ఆర్డీవో, జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి పి. సాయి రామ్, జీహెచ్‌ఎంసీ ఐటీ విభాగం డిప్యూటీ ఇంజనీర్ నర్సింగ్‌రావు, పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ మనసా కృష్ణకాంత్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ బచంజీత్ సింగ్ వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఎన్నికల సమయంలో ప్రసార, ప్రచురణ మాధ్యమాల్లో వచ్చే వార్తలు, ప్రకటనలు, పెయిడ్ న్యూస్‌పై నిరంతరం పర్యవేక్షణ చేయనుంది.

ప్రింట్ మీడియాకు ప్రత్యేక నిబంధనలు

ప్రింట్ మీడియాలో ఇచ్చే ప్రకటనలకు సంబంధించి పోలింగ్‌కు ముందు రోజు ప్రి-పోల్ డే, పోలింగ్ రోజు ఇచ్చే వాటికి మాత్రం ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి అని కర్ణన్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెం ట్లు ప్రకటనల ప్రచురణకు ముందు కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా, ప్రింటింగ్ ప్రెస్‌లు ముద్రించే కరపత్రాలు, హ్యాండ్ బిల్లులపై పబ్లిషర్ పేరు, చిరునామా స్పష్టంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.