17-08-2025 06:37:22 PM
సీఐటీయూ బస్తీ బాట
శ్రీరాంపూర్,(విజయక్రాంతి): సింగరేణి కార్మిక వాడల్లో కార్మికులు ఎదుర్కొంటున్నసమస్యలను సింగరేణి యాజమాన్యం పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి కోరారు. ఆది వారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-6 కాలనీ, నస్పూర్ డిస్పెన్సరీ ఏరియాలలో బస్తీబాట నిర్వహించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను విలేకరులకు వివరించారు.
రెండు రోజుల కిందట కొట్టిన వర్షానికి కంపెనీ క్వార్టర్లలో ఉన్న కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దుర్భరమైనటువంటి స్థితిలో ఉందని, ఎప్పుడో కట్టిన డ్రైనేజీ వ్యవస్థ ఎత్తుగా ఉండడం క్వార్టర్లు కిందికి ఉండటంతో డ్రైనేజీ నీరంతా ఇంటిలోకి వస్తుందన్నారు. దీనితో నిత్యవసర వస్తువులు, సామాను, బియ్యం బస్తాలు తడిసి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వంటింట్లోని ఫ్రిడ్జ్, ఎలక్ట్రికల్ వస్తువులకు కూడా వరద నీరు తాకితే ఎలక్ట్రిక్ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని, వీలైనంత త్వరగా యాజమాన్యం కార్మికుల బాధలను, సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఏరియా జిఎం, సివిల్ డివైజియం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యే విధంగా చూస్తామన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు సొంత ఇంటి పథకం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు.