calender_icon.png 17 August, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి

17-08-2025 07:42:04 PM

జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సంసిద్ధమై ఉందని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్  ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్న గణేష్ మండప నిర్వాహకులు, సభ్యులు, కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ  రూపొందించిన గణేష్ మండప నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htm  లో వివరాలను నమోదు చేసుకోవాలని తెలియజేశారు.

ఈ వెబ్సైట్ నందు వినాయక మండప వివరాలు, వినాయక చవితి మొదలు, నిమజ్జన తేదీ, సమయం, ప్రయాణించే దారి, మండప ప్రదేశం, ప్రదేశం ఓనర్ వివరాలు, గణపతి విగ్రహ ఎత్తు, మండపం ఎత్తు, సంబంధిత పోలీస్ స్టేషన్, నిమర్జనం ప్రదేశం, మండపానికి సంబంధించిన సమాచారం, గణపతి తీసుకువెళ్లే వాహన వివరాలు డ్రైవర్, యజమాని వివరాలు పొందుపరచాలని సూచించారు. అదేవిధంగా మండప నిర్వహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు.

జిల్లాలోని పట్టణాలలో మరియు గ్రామాలలో నిర్వహించే గణపతి మండప నిర్వహకులు ఈ వెబ్సైట్ నందు వివరాలను పొందుపరచాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వివరాలు కాని సందర్భంలో దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు. భద్రత, బందోబస్తు కొరకే ఈ ఆన్లైన్ నమోదు విధానం అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయక ప్రతిష్టాపనకు ప్రాధాన్యత కేటాయించాలని  తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా జిల్లా పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని వెంటనే డయల్ 100 కు సంప్రదించాలని కోరారు.