జయశంకర్ సార్ ఆశయాలు పోలీస్ శాఖకు స్ఫూర్తి
- జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే కొనియాడారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు.
ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ కోసం ఉద్యమించి, ప్రజల్లో చైతన్యం నింపిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఆశయాల స్ఫూర్తితో పోలీస్ శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ మొగిలి, ఆర్‌ఐలు సురేష్, రమేష్, ఏఓ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, కార్యాలయ సూపరింటెండెంట్లు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






