6 August, 2026 | 6:54 PM

విద్యార్థినిలు ఆత్మవిశ్వాసంతో ఉండాలి

06-08-2026 05:37 PM

జనగామ,(విజయక్రాంతి): నర్మెట మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న బాలికల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యురాలు డాక్టర్ జి. సంయుక్త, నర్మెట్ట సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ కుమార్తె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంయుక్త మాట్లాడుతూ.. విద్యార్థినులకు ఆత్మ క్రమశిక్షణ, బాధ్యతాయుత జీవనం ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను వివరించారు.

విద్యార్థినులు తమ లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కాలానుగుణ వ్యాధులు, వాటి నివారణ మార్గాలు, వ్యక్తిగత పరిశుభ్రత, తాగునీటి శుభ్రత, పోషకాహారం, తగిన నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని,శారీరక బలాన్ని పెంపొందించుకోవచ్చని విద్యార్థినులకు సూచించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.