పడిలేచిన తెలంగాణ

25-04-2024 02:39:52 AM

ప్రొఫెసర్ కోదండరాం.. తెలంగాణలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ అది నిజం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఏర్పాటు చేసిన పొలిటికల్ జెఏసి చైర్మెన్‌గా ఉన్న ఆయన సబ్బండ వర్ణాలను, కులాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమ ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లాడు. స్వరాష్ట్ర  సాకారంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాడు. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాం అని కాళోజీ అన్నట్లు ఉద్యమ పార్టీని ప్రజల మద్దతుతో చిత్తుగా ఓడించడంతో ప్రధాన పాత్ర పోషించాడు. పదేళ్ల తెలంగాణ చేదు అనుభవాలను నెమరువేసుకుంటూనే తెలంగాణ పునరేకీకరణకు నడుం కడుతున్నాడు.. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాంతో విజయక్రాంతి చిట్ చాట్..

ఉద్యమంలో జేఏసి పాత్ర చాలా కీలకం అని చెప్పాలి.  అనేక ప్రజా సంఘాలు స్వతంత్రంగా ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనకు పని చేయడం అనేది మలిదశ ఉద్యమం ప్రత్యేకత. ఒక్క పార్టీయే మొత్తం నడపడం లేదు.  చాలా సంఘాలు ఉన్నాయి. అవన్నీ పని చేస్తూ ఉన్నాయి. తర్వాత ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం వివిధ ప్రజా సంఘాల ద్వారా అందరిని ఐక్యం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అనివార్యంగానే (జేఏసి) జాక్ ఏర్పడింది. దీనికి నాయకత్వం వహించే అవకాశం నాకు సహజంగానే వచ్చింది. అప్పటికే  తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొనడం దాంట్లో ఒక భాగస్వామిగా ఉండటం ఒక కారణం అయితే.  2001 లో ఐక్య వేదిక ద్వారా చాలా కార్యక్రమాలు చేశాను. తెలంగాణలో వస్తున్న కరువు గురించి, తెలంగాణలో కరెంటు కోతల గురించి 610 జీవో, స్థానిక రిజర్వేషన్లు కోసం చాలా గట్టిగా ఆందోళనాల నిర్మాణానికి ప్రయత్నం చేశాం.

అప్పటికీ అందులో నేను భాగంగా ఉన్నాను. అదే విధంగా 2004లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో కూడా క్రీయశీలంగా పాల్గొనడంతో  తెలంగాణ వ్యాపితంగా పరిచయాలు ఏర్పడ్డాయి. దానికీ తోడు మేం రాజకీయ నాయకత్వం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించలేదు. వ్యక్తీకరణ ఇవ్వడానికి రాజకీయాలు చాలా అవసరం. రాజకీయాల పాత్రను కూడా గుర్తించకపోతే సమస్య వస్తదని మేం భావించి వాటి వ్యక్తికరణ కోసం రాజకీయాలతో సంబంధాలను కాపాడుకున్నాం. టీఆర్‌ఎస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలతో కూడా అదే రకంగా ఒక మంచి సంబంధాలు ఉండేవి. అందరినీ ఐక్యం చేసేందుకు అన్నీ రాజకీయ పార్టీలు ఒక పేరు ఆలోచించినప్పుడు  సహజంగానే నా పేరు వచ్చింది. మీగతా వాళ్లు దాన్ని ఆమోదించడం జరిగింది. దాన్ని నడపలేకపోయి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది ఉండేది. కానీ చాలా ఓపికగా ఈ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకపోతే తెలంగాణకు పెద్ద నష్టం జరుగుతుందనే అనే భయం నాకైతే చాలా కలిగింది. ఆ భయంతో ఉద్యమాన్ని చాలా బాధ్యతగా, జాగ్రత్తగా ఉద్యమ కార్యక్రమాలన్నీ నిర్వహించాం. జేఏసీని ప్రజాస్వామికంగా నడిపాం. నేననే కాదు స్టీరింగ్ కమీటి అట్ల వ్యవహరించింది. స్టీరింగ్ కమిటీ, నేను బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల అది సాధ్యం అయింది.

ఈ పదేళ్ల తెలంగాణ దశ, దిశ ఎటువైపు?

తెలంగాణకు మిగతా రాష్ట్రాలకు వున్న తేడా ఏంటం టే ఇక్కడి అభివృద్ధి ఎజెండాను ఇక్కడి ఉద్యమాలే నిర్ణయిస్తాయి.  కాని ఇక్కడ ఒక పొరపాటు జరిగింది ప్రజా ఉద్యమాలు అనేది తమకు తాము ఒక పరిమితిని విధించుకున్నాయి. ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా అనే ధోరణితో వ్యవహరించాయి. రెండొది మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు నిర్వర్తిస్తే తప్పేంముంది అనే అనుకున్నారు. నా దష్టిలో ఈ రెండింటిని తప్పు బట్టడానికి వీలులేదు. తప్పని సరిగా ఆహ్వానించదగిన పరిణా మం. కానీ అధికారంలో వున్న వాళ్ళు సరిగ్గా పని చేయనప్పుడు అడగటానికి కూడా మనం సిద్ధంగా ఉంటే మనకు ఇబ్బంది కలిగేది కాదు.  తప్పు జరుగుతున్నది అని అనిపించిప్పుడు గట్టిగా నిలబడి ప్రశ్నను సంధించడం చేసి ఉంటే అది కొంత బాధ్యతగా పని చేసేది.  ఎంత ఉద్యమం నడిపినా గానీ, భాగస్వామ్యలు అయినప్పటికీ కూడా కేసీఆర్ తాను తన రాజకీయాలకు ఇచ్చినట్టువంటి ప్రాధాన్య త తెలంగాణ ఉద్యమ ప్రయోజనాల విషయంలో మా త్రం దాన్ని ప్రదర్శించలేకపోయాడు. ఎంత సేపు తాను, తన స్వార్థం చూసుకున్నాడు. నీళ్లు, నిధులు, నియామకా లు మనం చేయాల్సిన పనులు అని కొన్ని అనుకున్నారు. కానీ అంతిమంగా ఏం చేశారంటే తమ లాభం ఒకటి చూసుకున్నారు. రెండు సరళీకరణ రాజకీయాలను తిరస్కరించాలి.

కానీ వాటిని బలంగా పునాదిగా చేసుకొని మిగతా విషయాలను అమలు చేయడం ప్రారంభించారు. అక్కడే సమస్య వచ్చింది. ఒక వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం కావడం, ఆయన ఇష్టానుసారంగా బాధ్యత లేకుండా చట్టానికి పక్కన పెట్టి తన ఇష్టాను సారంగా అధికారంగా చేలాయించడం, ప్రజా పాత్రను తగ్గించి చూడటం అనేదే తెలంగాణ పతనానికి మూల కారణం. ప్రజలు కూడా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఆ చైతన్యంతో వ్యవహరించ గలిగారు. అందు వల్ల ఒక మార్పు అనేది జరిగింది. ప్రజలు తిరస్కరించారు. ఇది కూడా ఒక ఉద్యమ రూపంలో జరిగిందని అనుకోవాలి.

కాంగ్రెస్ గెలుపుకు కారణం ఇదే! 

బీఆర్‌ఏస్‌ను ప్రజలు తిరస్కరించడం అనేది ప్రధాన అంశం. పూర్తిగా దాన్ని ఒక నెగెటివ్ అని చెప్పడానికంటే కూడా దాంట్లో కొంత పాజిటివ్ కంటెంట్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రజల ముందు పెట్టడం. అన్నింటి కంటే మించి ఒక ప్రజాస్వామికంగా వ్యవహరిస్తామని హామి ఇవ్వడం అనేది కీలక పాత్ర పోషించింది, అదే పార్టీ  గెలుపుకు ఉపయోగపడింది. 

కొత్త పార్టీలో భాగస్వామ్యం తప్పని సరి! 

కొంత భాగస్వామ్యం అయితే ఉంది లేదని అనటానికి లేదు. ఇంతకు ముందు నేను అన్నట్టు పోయిన బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యమకారులకు దొరికిన భాగస్వామ్యం అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణకు ఉపయోగపడింది. అది మనం ప్రధానంగా గ్రహిస్తే ఇప్పడు అట్లా కాకుండా ఉండాలి అనేదే మాకు న్న అభిప్రాయం. అది అర్థవంతంగా ఉండాలి. వాళ్లకు ఉపయోగపడాలి. ప్రజలకు లాభం కలగాలి. అది మేం అనుకుంటున్నది. ఇది ఒక ప్రయోగం మా దృష్టిలో. చర్చలు, సంప్రదింపుల ద్వారా ప్రభుత్వంతో మాట్లాడి కొన్నింటిని నేరవేర్చుకోవచ్చు అనేది మనం ఇప్పుడు కొత్తగా చేస్తున్న ప్రయోగం. ఇది ఇంత వరకు మనకు అనుభంలో లేని విషయం.  బీఆర్‌ఎస్ పాలనలో ఈ ప్రయత్నం విఫలం అయింది.

అందులో ఎవర్నో ఒకరిని తప్పుబట్టడం కంటే వ్యక్తిగతమైన నిందరోపణాలకు దిగడం కంటే మొత్తంగానే ఆ ప్రయోగం విఫలం అయిందని గుర్తించగలిగితే అది చాలా లాభంగా ఉంటది. చాలా జాగ్రత్తగా మనం మన అనుభవాలను భేరిజు వేసుకోవాలి. ఆ అనుభవాల నుంచి నేర్చుకోవాలి. దాన్ని స్వీకరించాలి. బాలగోపాల్ ఒకటి అనేవా డు. మన కార్యాచరణనను మనం నిరంతరం ప్రశ్నించుకోవడం, పరిశీలించడం, విశ్లేషించుకోవడం. దాన్ని నుంచి సూత్రీకరించి మనం ఇంకా ముందుకు పోవడానికి ఏం చేస్తే బాగుంటదని ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకోవడం ఇది మన ముందు ఉన్న ఒక బాధ్యత అని పౌర హక్కుల సంఘం గురించి చెప్తుతుండే వారు. పౌర హక్కుల సంఘానికి మాత్రమే కాదు ప్రతి దగ్గర కూడా అది చాలా కీలకమని నేను అనుకుంటున్నా. ఆ ప్రయత్నం మనం చేయాలని కూడా నేను భావిస్తా. 

రెండు లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా? 

రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి. అది పెద్ద సమస్యే కాదు. కానీ అందరు ఉద్యోగాల పరిధిలో లేరు. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు పొందే పరిధిలో లేరు. ఇంకా బోలెండంత మంది ఉద్యోగాల వెలుపల ఉన్నారు. వాళ్లకు కావాల్సిన శిక్షణ, వాళ్లకు కావాల్సిన ఉపాధి అనేది కూడా చాలా కీలక అంశం. వెనకటికి వ్యవసాయం మీద అందరూ ఏదో ఒక పని చేసుకొని బతికేటోళ్లు. ఇవాళ అది సాధ్యం కాదు. కారణం ఏదంటే మళ్లీ మనం వ్యవసాయన్ని కూడా మార్చుకొని అక్కడ కూడా  అవకాశాలను కొంత పెంచాలి. అది అవసరం. కానీ దాంతో పాటు బయట బాగా బలపడిన సేవా రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనే విధంగా కావాల్సిన ట్రైయినింగ్, శిక్షణ ఇవ్వడం అనేది చాలా అవసరం.

పాలకుల దోపిడిని ఆపాలి

పెద్ద తప్పు ఏదంటే కేసీఆర్ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి నాకు అన్నీ తెలుసు అని ఆయన చేసిన ప్రచారాన్ని మనం ఆమోదించాం. ఆయన అన్నీ  కరెక్టే చేస్తడని నమ్మినం. తర్వాత ఆయన అధికారాన్ని ఇష్టానుసారంగా నిర్వహించి దొచుకోవడం మొదలు పెట్టాడు. ఆ దొచుకోవడం అనేది ఇవాళ ప్రధానంగా తెలంగాణ వెనుకబాటుతనానికి కారణం. పాలకుల దోపిడిని ఆపకపోతే మనకు సమస్య వస్తది. 


 రూప