కదం తొక్కిన విద్యార్థులు

25-04-2024 02:36:05 AM

తెలంగాణలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా, గడీలపై పోరాడింది ఇక్కడే. చాకలి ఐలమ్మ, కాళోజీ, జయశంకర్ ఇక్కడి వారే. మా కొలువులు మాగ్గావాలె.. అనే నినాదంతో మొదలైన తొలిదశ ఉద్యమం స్వరాష్ట్ర కాంక్షను రగిలించింది. ఈ పోరాటానికి విద్యార్థులు, మేధావులు, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అంతటి ఘన చరిత్ర కలిగిన వరంగల్ గురించి స్పెషల్ స్టోరి ఈ వారం మీకోసం..

ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలంటూ మొదలైన తొలిదశ ఉద్యమం ఆరు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. పెద్ద మనుషుల ఒప్పందాన్ని పక్కన పెట్టి,  సీమాంధ్ర పాలకులు తమ వారికే ప్రాధాన్యతనిస్తూ, ఇక్కడి వనరులు దోచుకుని ఆంధ్రాను అభివృద్ధి చేస్తుండటాన్ని సహించక మొదలైంది 1969 ఉద్యమం. అప్పటికే హైద్రాబాద్ రాష్ట్రంలో అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలను కాదని వలస వాదులకు ఉద్యోగాలు ఇవ్వడం అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయింది.  

ఈ నిర్లక్ష్య ధోరణి సహించని తెలంగాణ యువత ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఈ పోరాటం క్రమంగా వరంగల్ జిల్లాకు పాకింది. యూనివర్సిటీ విద్యార్థులతో పాటు మేధావి వర్గం కూడా ఏకమై ఆందోళనలు చేశారు. తెలంగాణేతర ఉద్యోగుల్ని వెనక్కి పంపి, తెలంగాణ యువతకు ఉద్యోగాలు అప్పగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఈ డిమాండ్‌కు మద్దతుగా నిలిచింది మేధావి లోకం. దీంతో తొలిదశ ఉద్యమానికి వరంగల్ కేంద్ర బిందువుగా మారింది. విద్యార్థులంతా తమ చదువులు పక్కన పెట్టి ఉద్యమాల బాట పట్టారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలతో పాటు సికెఎం, ఐటిఐ, కెఎంసి, ఆర్‌ఈసి, ఈవినింగ్ కాలేజీ, పింగిలి కళాశాలల్లో చదవుతున్న విద్యార్థులంతా ఏకమై వరంగల్ విద్యార్థుల కార్యచరణ సమితి ఏర్పాటు చేశారు. ఈ సమితి ద్వారా ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా పోరాటం చేస్తామంటూ ప్రకటించి, అందుకనుగుణంగా కార్యాచరణ ప్రకటించారు. 

ఉద్యమ ఉధృతిని గమనించిన నాటి పాలకులు వరంగల్ విద్యార్థులపై ఉక్కుపా దం మోపాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులకు, విద్యార్థులకు మద్య కొద్దిరోజుల పాటు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయినా విద్యార్థులు తమ ఆందోళనలు కొనసాగిస్తూ, జిల్లా ప్రజలను చైతన్యం చేస్తుండటాన్ని జీర్ణించుకోలేక పింగిలి కళాశాల నుంచి మొదలైన ర్యాలీపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. తొలి దశ పోరాటంతో వరంగల్ ఆదర్శంగా నిలవటంతో.. వేల సంఖ్యలో యువకులు తెలంగాణ వ్యాప్తంగా పోరాటం కొనసాగించారు. ప్రధానంగా హైద్రాబాద్ లో కూడా వరంగల్ విద్యార్థులు నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో అక్కడి ప్రజలు కూడా మద్దతు ప్రకటించి, ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉద్యమ ప్రభావం తీవ్రతరం కావటంతో దాదాపు ఏడాదికి పైగా వరంగల్ జిల్లా యుద్ధ భూమిని తలపించింది. ఈ పరిస్థితుల్లో కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 95 సార్లు ఉద్యమకారులపై కాల్పులు జరిపినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. పరిస్థితులు విషమించటంతో వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూ విధించారు. వీటన్నిటిని చేధిస్తూ నాటి విద్యార్థి నాయకులు పులి సారంగపాణి, టి.సిద్ధులు ఆధ్వర్యంలో నగరంలోని మదీన, కోహినూర్ హోటళ్ళలో సమావేశాలు ఏర్పాటు చేశారు.  నిత్యం ప్రాంతీయ వార్తలు వింటూ మరునాటి కార్యాచరణను ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళారు. 

ఆంధ్రా పాలకుల చెప్పు చేతల్లో ఉండే పత్రికలు ఉద్యమ వార్తలు ప్రచురించటంలో నిర్లక్ష్యం వహించేవి. ఓవైపు ప్రత్యేక పోరు జరుగుతుండగానే మరోవైపు సదాశివపేటకు చెందిన శంకర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. పిల్లల నుంచి పండు ముసలి వరకు ర్యాలీలు నిర్వహిస్తూ ఆందోళన బాట పట్టా రు. నాటి ఉద్యమంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు పాల్గొన్నా, వరంగల్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకుని మొదటి స్థానంలో నిలిచింది. 

 హనుమకొండ, విజయక్రాంతి