20-12-2025 09:25:47 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల ఎన్. ఐ. సి. వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, గృహ నిర్మాణ శాఖ పి. డి. ప్రకాష్ రావు లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, గృహ నిర్మాణ శాఖ ఎ. ఈ.లు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పనులు వేగవంతం చేసి పురోగతి సాధించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయితీ కార్యదర్శులు తమ పరిధిలో ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంకా ప్రారంభం కానీ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడి తప్పనిసరిగా ఇంటి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఇండ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పూర్తి అయిన ఇండ్లను గృహప్రవేశాల కొరకు సిద్ధం చేయాలని, గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇండ్ల నిర్మాణాలపై పర్యవేక్షించి పనులు వేగవంతం చేసేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, గృహ నిర్మాణ శాఖ డి. ఈ. ఈ. వేణుగోపాల్ సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.