23-07-2024 04:05:00 AM
ఎలా ప్రవర్తిస్తారా అని ఆసక్తిగా జనం
నేడు బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు తొలిసారిగా బడ్జెట్ రోజు అసెంబ్లీలో అడుగుపెట్ట నున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష నేతగా మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాను న్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగే బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశానికి అధ్యక్షత వహించి సభలో చర్చించాల్సిన అంశాలను సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.
గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాలేదు. అప్పట్లో ఆయన సభలో మాట్లాడేందుకు ముఖంలేదని, ఎక్కడ తమ పాలనలో జరిగిన తప్పులు ఎత్తిచూపుతారనే భయంతో రాలేదని కాంగ్రెస్ సభ్యులు విమర్శలు కురిపించారు. దీంతో ఈసారి సభకు హాజరుకాకపోతే ప్రజలకు పార్టీపై నమ్మకం లేకుండా పోతుందని ఎమ్మెల్యేలంతా ఆయనను కోరడంతో సభకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.