20-11-2025 05:13:21 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
కరీంనగర్ (విజయక్రాంతి): బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల సంరక్షణ చట్టాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని అన్నారు. స్నేహితా కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ బాలల హక్కులను వివరిస్తున్నామని అన్నారు. బాల బాలికలు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా 1098 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఎలాంటి వేధింపులు ఎదురవుతున్న పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పెట్టెలో ఫిర్యాదు వేయాలని అన్నారు. బాలలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పిల్లలకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సైన్ లాంగ్వేజీ లో జాతీయ గేయం పాడిన వారిని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన ప్రభుత్వ క్రీడా పాఠశాల విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గంగాధర్, మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.