21-12-2025 12:00:00 AM
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్
ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద నిరసన
పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, జూపల్లి, వివేక్, వాకిటి
హైదరబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 20 (విజయక్రాంతి): గాంధీ కుటుంబం పేరు చెపితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడతాయని, గాడ్సేని పూజించే వారు కాబట్టే గాంధీ పేరును తొలగిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ శనివారం సికింద్రాబాద్ ప్యారడైజ్ ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, జూప ల్లి కృష్ణారావు, వివేక్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం మోదీ, అమిత్‌షాకు లేదన్నారు.
ప్రజలకు 100 రోజుల ఉపాధి కోసం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసు కొచ్చిందని, 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ పథకానికి నిధుల కోత పెడుతూ వస్తోందని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. రా జ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని, సోనియా గాంధీ కుటుంబంపై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయం అని మహేశ్‌కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు.