calender_icon.png 4 September, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులను అరికట్టాలని కలెక్టరేట్ ముందు ధర్నా

01-09-2025 11:25:20 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) రాష్ట్ర  సహాయ కార్యదర్శి బేజాడి కుమార్  పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున గ్రామీణ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందన్నారు. వెంటనే సీజనల్ వ్యాధులను అరికట్టే చర్యలను ప్రభుత్వం చేపట్టాలన్నారు. గ్రామాలలో పాలకవర్గాలు లేకపోవడం మూలంగా పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు.

వెంటనే గ్రామాలలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని, బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పిచికారి చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అనేకమంది ఆదివాసీలు, గిరిజనులు, అమాయక పేద ప్రజలు విష జ్వరాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. విపరీతంగా దోమలు వ్యాప్తి చెంది రకరకాల జబ్బులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. వెంటనే దోమతెరలను పంపిణీ చేయాలన్నారు. గ్రామాలలో పల్లె దవాఖానాలు మొదలుకొని మండలాలలో పీ హెచ్ సీ సెంటర్లు అనేక సమస్యలతో నడుస్తున్నాయన్నారు. మండల కేంద్రాలలో 24 గంటల వైద్య సదుపాయం 108 అంబులెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు.

ప్రభుత్వ వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచి అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం మూలంగా ప్రజలు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్తున్నారన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో విపరీతమైన బిల్లులు వేసి ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారన్నారు. వైద్య రంగ సమస్యలు పరిష్కరించే వరకు ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ దశల వారీ ఆందోళనా కార్యక్రమాలను కొనసాగిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.