calender_icon.png 19 October, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే..

18-10-2025 08:49:31 PM

బంద్ లో భాగంగా ఉప్పల్ ఆర్టీసీ డిపో ముందు నిరసన తెలిపిన డి. రాజారాం యాదవ్..

మేడిపల్లి (విజయక్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురు కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీసీ జేఏసీ కో చైర్మన్ రాజారామ్ యాదవ్ అన్నారు. అసలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. బీసీల రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించాలని రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు.  ఆగ మేఘాల మీద ఆర్డినెన్స్ తెచ్చి అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన బీసీ ప్రధానినని చెప్పుకుంటున్న మోడీ బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగ సవరణకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.

బీసీలు ఈ దేశంలో ఏం పాపం చేశారని రాజారామ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.  42 శాతం రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. శనివారం నాడు బంద్ లో భాగంగా హైదరాబాదు ఉప్పల్ డిపో ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సంజీవ్ నాయక్,  యాదవ జేఏసీ కన్వీనర్ మేకల రాములు యాదవ్, బీసీ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ గుండెబోయిన అయోధ్య యాదవ్, బీసీ జర్నలిస్టుల ఫోరం ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి రాజు, ఎంబీసీ కులాల అధ్యక్షుడు నిమ్మల వీరన్న, వివిధ పార్టీలు, కుల సంఘాలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.