calender_icon.png 19 October, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట ప్రేమ

18-10-2025 10:30:13 PM

బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్..

వరంగల్/హన్మకొండ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ ది రాజకీయ ప్రేమ మాత్రమేనని, అమలులో ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ స్పష్టం చేశారు. శనివారం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు వరంగల్ నగరంలో శాంతియుతంగా బంద్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గంట రవికుమార్ మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైంది అంటూ ప్రశ్నించారు. బీసీపై రేవంత్ రెడ్డి సర్కారుది కపట ప్రేమ అని విమర్శించారు. నాడు జయలలిత తమిళనాడులో 9వ షెడ్యూల్ ప్రకారం 58 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయలేదా అంటూ గంట నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పట్ల చిత్తశుద్ధి లేదని, దీనికి కోర్టు తీర్పు నిదర్శనమన్నారు. బీసీ రిజర్వేషన్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగానే, జీవో తీయడమే ప్రభుత్వం అసలు కుట్ర బయట పడిందన్నారు.

రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసి, రాజకీయ లబ్ది పొందాలని చూసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతగాని తనాన్ని ఇతర పార్టీలపై బురదజల్లే ప్రయత్నం చేసి, రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. 42% రిజర్వేషన్ కల్పించే వరకు బీసీల పక్షాన మేము పోరాడుతామని రవికుమార్ హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే, 2019లో 23 శాతానికి కుదించారని, రిజర్వేషన్ల విషయంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచినప్పటికీ, చట్టాలను అడ్డంపెట్టి రిజర్వేషన్లకి అడ్డుపడటం అంటే సామాజిక న్యాయానికి, సహజ న్యాయానికి అడ్డుపడటమే అన్నారు. అనంతరం బీజేపీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రిజర్వేషన్ల సాధనకి, బీసీజాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కు సహకరించిన అన్ని వ్యాపార, వాణిజ్య, విద్య రంగానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.