calender_icon.png 19 October, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓరుగల్లులో కదం తొక్కిన విద్యార్థి లోకం

18-10-2025 10:46:12 PM

పోలీసు బందోబస్తు మధ్య బీసీ ఉద్యమ కవాతు

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు సాగిన బంద్ లో భాగంగా పాఠశాల కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో కదం తొక్కారు. మేమెంతో, మాకంత అనే నినాదంతో 42 శాతం రిజర్వేషన్ వాటా, కోటా బరాబర్ తమదేనంటూ ఓబీసీ చైర్మన్, మాజీ కుడా చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో హనుమకొండలోని పలు పాఠశాలల, జూనియర్ కళాశాలల, డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు విద్యార్థులు, మేథావులు, అధ్యాపకులు ఓరుగల్లు వీధుల్లో కదం తొక్కారు. బహుజన జెండాలు, బీసీ రిజర్వేషన్ నినాదాలతో ఓరుగల్లు ఓక్కసారిగా పిడికిలి బిగించి గొంతెత్తి నినదించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్చందంగా మూసివేసి, ఉద్యోగులు, విద్యార్థులు, మేథావి వర్గం అంతా పిడికిలి బిగించి సమరానికి జై కొట్టింది.

ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ సహా యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, ఆచార్యులు, కుల సంఘాల ప్రతినిధులు హనుమకొండ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం వరకు విద్యార్థులు, ఉద్యమకారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్ రాజ్ యాదవ్  మాట్లాడుతూ నాడు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు, ఉద్యమకారులు, మేథావులు, బీసీలు తెగించి కొట్లాడారని, నేడు తెచ్చుకున్న తెలంగాణలో జనాభాలో సగం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కావాలని ఉద్యమించాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. దానిలో భాగంగా తొలి దశలో 42 శాతం రిజర్వేషన్ ను స్థానిక సంస్థల్లో సాధించాలని అందుకోసం సబ్బండ వర్గాలు పిడికిలి బిగించి పోరాటం చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎగసిపడ్డ విద్యాసంస్థలు, విద్యార్థులు బీసీ బంద్ సందర్భంగా చీమల దండులా వందలాది మంది కదిలి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతీ ఉద్యమకారుడు బీసీ జెండా చేత పట్టుకుని, రిజర్వేషన్ సాధన నినాదాలతో హోరెత్తించారు. రెండు కిలోమీటర్ల మేర కిక్కిరిసిన ర్యాలీలో యువత, ఆటో కార్మికులు, మహిళలు, విద్యార్థినిలు, పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆందోళన కారుల నినాదాలు, బీసీ రిజర్వేషన్ ఆకాంక్షతో నాటి తెలంగాణ ఉద్యమం కళ్లముందు కదలలాడింది. నాటి ఉద్యమ స్వరూపాన్ని మేథావులు, విద్యార్థులు, ఉద్యమకారులు మరోసారి ఆ స్పూర్తిని ఓరుగల్లు పురవీధుల్లో చాటారు. హైస్కూల్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల నుంచి పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు, మేథావులు, కార్మికులు, వ్యాపార వర్గాల ఆకాంక్షను ఎలిగెత్తిన భారీ ర్యాలీలో డీజీపీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

రెండు గంటల పాటు సాగిన ర్యాలీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్దీకరించడం చాలా రోజుల తర్వాత ఉద్యమ స్వరూపానికి ర్యాలీ నిర్వహణ అద్దం పట్టింది. బీసీ బంద్ ర్యాలీలో ఓబిసి ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్, ఓబిసి ఉపాధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, ఓబీసీ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్, తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్ ఫోరం రాష్ట్ర సలహాదారుడు గంగాపురం వేణుమాధవ్ గౌడ్, మౌనిక గౌడ్, రాజేష్ కుమార్, అఖిలభారత యాదవ మహాసభ అధ్యక్షులు రాజయ్య యాదవ్, రాజు ముదిరాజ్, బీసీ ఉద్యమకారులు, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.