calender_icon.png 26 August, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమగూడెంలో ఆందోళన

26-08-2025 01:27:28 AM

-కోర్టు ఆదేశాలతో ఇళ్లను తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకున్న యజమానులు

-ఐదు రోజుల్లోగా తొలగించాలని అధికారుల ఆదేశాలు

బెల్లంపల్లి, ఆగస్టు 25: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 3లో కోర్టు కేసులో ఉన్న ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలను బెల్లంపల్లి సివిల్ కోర్టు ఆదేశాలతో సోమ వారం కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా ఇళ్ల యజమానులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు.

కోర్టు కేసులో ఉన్న 2.75 సెంట్ల భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారని భూమి యజమాని రామ్ కృష్ణయ్య కోర్టులో కేసు వేశారు. 40 ఏళ్ల తర్వాత కేసు గెలవడంతో బెల్లంపల్లి సివిల్ జడ్జి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చారు. మూడు రోజులలోపు స్వచ్ఛందంగా 13 ఇళ్ల నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు.

నిర్మాణాలు తొలగించి నట్లయితే అధికారులతో బలవంతంగా ఖాళీ చేయిస్తారని నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టగా ఇళ్ల నిర్మాణదారులు ఆందోళనకు దిగి అడ్డుకున్నారు.

భూమి యజమాని రాం కృష్ణయ్య మాట్లాడుతూ 40 ఏళ్లుగా మా పట్టా భూమి కోసం పోరాటం చేయడంతో తమకు కోర్టు న్యాయం చేసిందని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు తమ భూమిని ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో నిర్మాణాలను  ఐదు రోజుల్లోగా తొలగించాలని ఇళ్ల నిర్మాణదారులకు అధికారులు సూచించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.