17-07-2025 12:00:00 AM
-యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
-156 మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాల ప్రదానం
నిజామాబాద్, జూలై 16 (విజయక్రాం తి): తెలంగాణ యూనివర్సిటీలో ప్రసంగించడం తనకు ఎంతో గర్వంగా ఉన్నదని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు టీయూ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. బుధవారం యూని వర్సిటీలో నిర్వహించిన రెండవ స్నాతకోత్సవంలో వర్సిటీ కులపతి అయిన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న దన్నారు. విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు, ప్రగతి పూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమై నేడు ఏడు విభాగాల్లో 24 ఉప విభాగాలుగా 31 కోర్సులతో బిక్కనూరు సారంగపూర్ క్యాంపస్‌లతో సహా ఇక్కడ ప్రధాన క్యాంపస్‌లో విద్య ఎంతగానో వికాసం చెందడం ఆనందంగా ఉన్నదన్నారు.
స్నాతకోత్సవంలో 15 విభాగాల్లో 2014 నుండి 2023 వరకు 132 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. 156 మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేశారు. స్నాతకోత్సవంలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, పైడి రాకేష్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.
స్నాతకోత్సవం అనం తరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిజామాబాద్ కలెక్టరేట్‌లో జిల్లాకు చెందిన వివిధ రంగాలలో ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు పలు రంగాలకు చెం దిన ప్రముఖులతో ఇష్టాగోష్టి జరిపారు.