calender_icon.png 18 July, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరస్పర సహకారంతో క్లీన్ ఎనర్జీకి భవిష్యత్

18-07-2025 12:30:52 AM

  1. సీబీజీ, సీజీడీ నెట్‌వర్క్ ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలి 
  2. ఢిల్లీలో ఇంధన భద్రత, సహకార విధానాల సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత మండపంలో ‘ఉర్జా మంథన్ 2025’ కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పూరి అధ్యక్షతన గురువారం జరిగిన ఈ సమావేశంలో దేశ ఇంధన భద్రత, సహకార విధానాలపై చర్చ జరిగింది. దేశంలోని 22 రాష్ట్రాల నుంచి మంత్రులు హాజరై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడంలో కేంద్ర- రాష్ట్రాల పరస్పర సహకారం ఎంతో అవసరమన్నారు. తెలంగాణలో రాష్ర్ట క్లీన్, గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 కింద కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు.

బయో ఇంధనాలు, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ), సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌లపై దృష్టి సారించి.. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలు చేశారు. నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ల విస్తరణ చేపడుతున్నామని, ఇది హైదరాబాద్ నగరమే కాకుండా.. ద్వితీయ శ్రేణి పట్టణాలలో సీజీడీ నెట్‌వర్క్‌లను వేగవంతం చేయాలని అందుకు రాష్ర్టవ్యాప్తంగా సమానమైన ఇంధన లభ్యతను పెంచాలన్నారు.

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌లో పెట్టుబడులను పెంచాలన్నారు. ‘ప్రోయాక్టివ్ విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక సంసిద్ధతతో, భారతదేశం క్లీన్ ఎనర్జీ పరివర్తనకు నాయకత్వం వహించడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది’ అని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.