05-08-2025 12:07:59 AM
రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ
జీజీహెచ్, వైద్య కళాశాలల సందర్శన, వైద్యాధికారులతో సమీక్ష
నిజామాబాద్, ఆగస్టు 04 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ సూచించారు. సోమవారం ఆయన నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రి, వైద్య కళాశాలలను సందర్శించారు.
ముందుగా జీజీహెచ్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తో కలిసి ఒక్కో విభాగం వారీగా అందిస్తున్న వైద్య సేవల గురించి. చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంకనూ అవసరం ఉన్న మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ పాలసీకి అనుగుణంగా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించాలని హితవు పలికారు.
అనంతరం మెడికల్ కాలేజీ పనితీరుపై ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ తో కలిసి సమీక్షించారు. వైద్య విద్యార్థుల శిక్షణలో భాగంగా కమ్యూనిటీ ఆరోగ్య శిబిరాల నిర్వహణపై చైర్మన్ తారిఖ్ అన్సారీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్ కు మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉన్నందున దీని వల్ల రోగులు,. వైద్య విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందేలా చూడాలన్నారు.
జీజీహెచ్, మెడికల్ కాలేజీల పనితీరు, నిర్వహణకు సంబంధించి సమగ్ర అంశాలను పొందుపరుస్తూ కమిషన్ కార్యాలయానికి నివేదికలు పంపాలని చైర్మన్ సూచించారు. కాగా, ఆసుపత్రి, మెడికల్ కాలేజీలను సందర్శించిన రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ లు పుష్ప గుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. సమీక్షలో వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, డాక్టర్లు, వైద్య కళాశాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.