18-06-2024 12:05:00 AM
కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. అటువంటి తిండికి అలవాటు పడటం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇంకా, జీర్ణకోశ సమస్యలు, క్యాన్స ర్ వంటి ప్రమాదకర జబ్బులకూ పరిస్థితి దారితీస్తుంది. ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే ఆహార పదార్థాలు సాధ్యమైనంత వరకూ తినక పోవడమే మంచిది. దేశంలో రోజురోజుకు ఆహార కల్తీ ఎక్కువవుతున్నది. ‘ఏది కొనాలి? ఏం తినాలి’ అన్నా భయపడే రోజులు వచ్చాయి. అనేకమంది తమ వ్యాపారం పెంచుకోవాలని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటు న్నారు. మరోవైపు అనారోగ్యాల కారణంగా ఆస్పత్రులు కూడా నిండుకుంటున్నాయి. టీ, కాఫీ, పాలు, పిండి, నూనెలు, మాంసం, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, బియ్యం.. ఇలా నిత్యం వినియోగించుకునే అనేక పదార్థాలు ‘కాదేదీ కల్తీకి అనర్హం’ అన్నట్టుంది పరిస్థితి.
నకిలీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆహార పదార్థాలపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో నామమాత్రపు సొమ్మునైనా కల్తీ నియంత్రణ, నిరోధానికి ఖర్చు పెట్టడం లేదన్న ఆరోపణలు వున్నాయి. నకిలీ సరకులపై న్యాయస్థానాలు స్వయంగా కేసుల్ని స్వీకరించి, మొట్టికాయలు వేసినా, సంబంధిత అధికార యంత్రాంగం మందగమనం వీడడం లేదు. కల్తీ వస్తువులను విక్రయించే వారిపై దాడులు తూతూ మంత్రమే ఆపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులకు ‘ఏది కల్తీ, ఏది అసలు’ అన్నది తెలుసుకోవడం చాలా కష్టమవుతున్నది.
ప్రజలలో అవగాహన పెరగాలి
‘భారతీయ ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ’ వినియోగదారులకు కొన్ని చిట్కాలు సూచించింది. త్వరగా కల్తీని గుర్తించే పరీక్ష (డీఏఆర్‌టీ) పేరున వీటిని ఒక కరదీపికలో పొందుపరిచింది. ఈ మధ్యకాలంలో చికెన్, లాలి పాప్, పకోడీలలో చికెన్ వేస్ట్ అయిన కాళ్ళు, స్కిన్, పేగులు కలపడం సాధారణమైంది. హైవే డాబాల మాంసంలో కుళ్ళినవి పెడుతున్నారని, చికెన్ బిర్యానీ బదులు కుక్క బిర్యానీ పెడుతున్నారని.. ఇలా చాలా వార్తలు చదువుతున్నాం. ఒక్క మాంసమే కాదు, బయటి ఫాస్ట్‌ఫుడ్స్ అన్నిట్లోనూ కల్తీ ఉంటున్నది. పరిమితికి మించి రంగుల వాడకం ఎక్కువగా ఉంటున్నది. రైల్వేస్టేషన్స్, బస్‌స్టేషన్స్ కాఫీ, టీ స్టాల్స్‌లలో సింథటిక్ పాల వినియోగం ఎక్కువగా ఉంటున్నది. ఇక ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో కల్తీ నూనెలు అదే పనిగా వినియోగిస్తున్నారు. పానీ పూరీ చేసే ఇళ్లల్లో పందులు కూడా నివసించవు. ఫ్రూట్ సలాడ్, ఐస్‌క్రీమ్, ఐస్, నూడుల్స్ తయారు చేసే ప్రదేశాలలోనూ శుచి శుభ్రత పాటించడం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రతి రోజు తనిఖీ చేయాలి. తయారీ కేంద్రాలను పరిశీలించాలి. ఎక్కువ మోతాదులో రంగుల వాడకాన్ని, కల్తీ పాల వాడకాన్ని నియంత్రించి తగిన చర్యలు తీసుకోవాలి.
మన చేతిలో లేని పరిష్కారాల విషయానికి వస్తే, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. లేకపోతే వ్యవసాయం చేసే రైతుల సంఖ్య రానురాను తగ్గిపోతుంది. మరోవైపు కల్తీ ఇంకా పెరుగుతుంది. అలాగే, మార్కెట్ ధరలు సైతం అధికమవుతాయి.
శిక్షలు కఠినంగా ఉండాలి
కల్తీ మీద ప్రచారం విస్తృతంగా పెరగాలి. వాటివల్ల తలెత్తే కీడు ప్రజలకు తెలియజేయాలి. ‘ఫెర్టిలైజర్స్ వాడకం కాన్సర్ కారణం’ అనే విషయాన్ని కూడా తెలియజేయాలి. ఆరోగ్య తనిఖీ అధికారుల సంఖ్యతోపాటు వారి అధికారాలూ పెరగాలి. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాలి. అలాగే, ప్రభుత్వం సేంద్రియ ఆహారం మార్కెట్లలో చౌకగా లభించేట్లు చూడాలి. మంచి ఆహార, ఆరోగ్య అలవాట్లు, వాటివల్ల కలిగే లాభాలు చెప్పి ప్రోత్సహించాలి. అప్పుడు ప్రజలకు సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుంది. ధరలూ తగ్గుతాయి. ఇండ్లలో, డాబాల మీద పెరటి తోటల పెంపకాన్ని, ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు పెంచుకోవాలి. నాణ్యమైన బియ్యం, పప్పులు, ఉప్పు, చింతపండు అందుబాటులో వున్నప్పుడు సంవత్సరంలో రెండుసార్లు కొనడం వల్ల కల్తీ బారి నుండి కొంతవరకు తప్పించుకోవచ్చు.
డా. యం. సురేష్ బాబు
రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక