18-06-2024 12:05:00 AM
అసలే డిజిటల్ యుగం. వేగవంతమైన ఉరుకుల పరుగుల జీవితం. ఎవ్వరికీ ప్రశాంతత లేదు, విరామం దొరకట్లేదు. జీవితాల్లో సంతృప్తి లభించడం లేదు. ఉల్లాస క్షణాలు, అమితానంద దృశ్యాలు కరువవుతున్నాయి. సంతోషంగా కుటుంబసభ్యులతో గడిపే ఘడియలు కొన్ని క్షణాలైనా అరుదై పోతున్నాయి. యాంత్రిక జీవనంలో కొంత ఉపశమనం, ఆరోగ్య పరిరక్షణ వెతుక్కుంటూ ఉల్లాసం కోసం విహారయాత్రలు, పర్యాటక క్షేత్ర దర్శనాలు, విజ్ఞాన యాత్రలు వంటివి ఎంతగానో ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పిక్నిక్‌లు లేదా విహారయాత్రలు సహజ ప్రకృతితో మమేకమవుతూ, హరిత దుప్పట్ల మీద కుటుంబ సభ్యులు భోజనాలు చేస్తూ గడిపే ఆనంద క్షణాలను ఆస్వాదించడం ఓ అద్భుత అనుభవం. ఏటా జూన్ 18న ‘అంతర్జాతీయ విహారయాత్రల దినం’ (ఇంటర్నేషనల్ పిక్నిక్ డే) జరుపుకుంటాం.
క్రీ.శ.1800 మధ్య కాలంలో ఫ్రెంచ్ విప్లవ సమయాన విహారయాత్రల ఆలోచనలు ప్రారంభమైనాయి. 20 జూన్ 2009న లిస్బన్, పోర్చుగల్‌లో 22,000 మందితో కూడిన అతిపెద్ద విహారయాత్రకు ‘గిన్న్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. అంతర్జాతీయ విహారయాత్రల దినం నాడు విద్యాలయాలు, కుటుంబాలు విహారయాత్రలు నిర్వహిస్తారు. అందరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. పెద్దలు తమ వయసును మరిచి పిల్లలుగా మారిపోతారు. విహారయాత్రలు పిల్లలకు విజ్ఞానయాత్రలుగా కూడా ఉపయోగపడతాయి.
జూన్ 3వ వారంలో వాతావరణం కూడా అహ్లాదకరంగా, ఆకర్షణీయంగా, అనుకూలంగా ఉంటుంది. విహారయాత్రలవల్ల కుటుంబ సభ్యులు, స్నేహితుల నడుమ చక్కటి అనుబంధాలు ఏర్పడతాయి. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఆగస్ట్ మొదటి సోమవారం సెలవు దినాన్ని ‘పిక్నిక్ డే’ నిర్వహిస్తారు. జీవితాలను పరిపూర్ణంగా ఆస్వాదించడానికి, శారీరక మానసిక ఉల్లాసానికి విహారయాత్రలు బాగా దోహదపడతాయి. ధనార్జన మాత్రమే ఆనందాన్ని ఇవ్వదని, మానసికానందం పొందలేని జీవితం నిరర్థకమని తెలుసుకుందాం. దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యమూ సిద్ధిస్తుందనడంలో సందేహం లేదు.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి