బహిరంగ విచారణే
- కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కసరత్తు
అఫిడవిట్లు ఇచ్చినవారిని విచారించేందుకు చర్యలు
కమిషన్‌కు అందని విజిలెన్స్ నివేదిక
ప్రభుత్వానికి మరోసారి లేఖ రాయనున్న కమిషన్
గురువారం హైడ్రాలజీ, నిపుణుల కమిటీతో భేటీ
త్వరలోనే మరోసారి ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలన
నివేదిక సమర్పణకు గడువు పొడిగించే అవకాశం
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారణ మరింత వేగం పెంచింది. బహిరంగ విచారణకు సర్వం సిద్ధం చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు అఫిడవిట్లు దాఖలు చేసిన ప్రతి ఒక్కరినీ ఈ బహిరంగ విచారణలో భాగస్వాములను చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు, అధికారులు, ఇంజినీర్లు, నిపుణులను ప్రాథమికంగా విచారించింది. గురువారం హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లు కమిషన్‌ను కలిశారు. రెండు వారాల్లోపు మధ్యంతర నివేదికను, సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అందించాలని రెండు కమిటీల ఇంజి నీర్లకు కమిషన్ సూచించింది. అయితే మొదట అనుకున్నట్టుగా జూన్ చివరి నాటికి కమిషన్ నివేదికను రూపొందించే అవకాశం లేదు. గత రెండు నెలలు అధికారులంతా ఎన్నికల్లో తలమునకలై ఉన్నందున నివేదికను అందించేందుకు గడువును పెంచక తప్పని పరిస్థితి కనపడుతోంది. ఇప్పటివరకు సుమారు 50 మందికిపైగా విచారించిన
కమిషన్.. సుమారు మరో 50 మందిని విచారించాల్సి ఉంది. అందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని సమాచారం. అందువల్ల నివేదిక సమర్పణకు గడువు పెంచాలనే ఆలోచనలో కమిషన్ ఉన్నట్టు సమాచారం. శుక్రవారం మరికొంత మంది అధికారులు, ఇతరులను కమిషన్ విచారణకు పిలిచింది. సాంకేతికాంశాలకు సంబంధించిన విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని నిపుణుల కమిటీలకు సూచించింది. మరోసారి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలనే ఆలోచనలో కమిషన్ ఉంది.
అందని విజిలెన్స్ నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ విచారణ చేసింది. విజిలెన్స్ డీజీ రాజీవ్త్రన్ సారధ్యంలో నిపుణుల బృందం విచారణ చేసి.. పలు ఫైళ్లను, రికార్డులను కూడా సీజ్ చేసింది. పలువురు అధికారులను విచారించింది. ఆ విజిలెన్స్ నివేదిక అందించాలని పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఆ నివేదిక ఇప్పటివరకు కమిషన్‌కు అందలేదు. దీంతో మరోసారి ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాయనున్నట్టు సమాచారం. విచారణలో భాగంగా ఇప్పటి వరకు సాంకేతికపరమైన అంశాలపై దృష్టి సారించిన కమిషన్.. ఇకపై ఆర్థిక అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి టెక్నికల్ అంశాలపైనే విచారణ కొనసాగుతుంది. త్వరలోనే ఈ సాంకేతిక అంశాల విచారణ పూర్తవనుంది. ఆ వెంటనే ఆర్థిక పరమైన అంశాల వారీగా విచారణను కమిషన్ ప్రారంభించనున్నట్టు సమాచారం.






