ఎమ్మెల్సీలుగా తీన్మార్ మల్లన్న, నవీన్‌కుమార్‌రెడ్డి ప్రమాణం
- శాసనమండలి చైర్మన్ చాంబర్‌లో ప్రమాణస్వీకారం
- చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రతిజ్ఙ
- వార్డుమెంబర్‌గా కూడా పోటీ చేయలేదన్న తీన్మార్ మల్లన్న
- పాలమూరు గడ్డ కేసీఆర్‌దేనని నవీన్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): తెలంగాణ శాసనమండలి సభ్యులుగా తీన్మా ర్ మల్లన్న (వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రులు), బీఆర్‌ఎస్ నేత నవీన్‌కుమార్‌రెడ్డి (మహబూబ్‌నగర్ సంస్థలు) ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో గురువారం తన ఛాంబర్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. మల్లన్న, నవీన్‌కుమార్‌రెడ్డి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకార కార్యక్రమంలో మండలి వైస్‌చైర్మన్ బండా ప్రకాష్, అసెంబ్లీ కార్యదర్శి నరిసంహాచార్యులు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. బీఆర్‌ఎస్ ఎమ్మె ల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో మాజీ ఏమంత్రి, ఎమ్మెల్సీ సబితాఇంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
వార్డుమెంబర్‌గా కూడా పోటీ చేయలేదు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
పట్టభద్రులు తనను ఎమ్మెల్సీగా ఎన్నుకోవడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు తాను వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయలేదని, నేరుగా ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పట్టభద్రుల తరపున వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. తన విజయానికి కృషి చేసిన పార్టీ నేతలకు మల్లన్న ధన్యవాదాలు తెలిపారు.
పాలమూరు జిల్లా కేసీఆర్ అడ్డా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి
పాలమూరు జిల్లా సీఎం రేవంత్‌రెడ్డి అడ్డా కాదని, అది కేసీఆర్ అడ్డా అని, అందుకు తన విజయంతో నిరూపించారని మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన విజయం తెలంగాణ అమరవీరులకు అంకితమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో తనను గెలిపించి, పాలమూరు కేసీఆర్ అడ్డా అని మరోమారు నిరూపించారని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలుకావనే తనను గెలిపించారన్నారు.






