30-07-2025 12:27:33 AM
రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి
మెదక్, జూలై 29(విజయక్రాంతి): పౌర సమాచార అధికారులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని, మెదక్ జిల్లాలో సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కితాబునిచ్చారు. మంగళవారం మెదక్ జిల్లా సమాచార హక్కు చట్టం కమిషనర్లు పర్యటన నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పౌర సమాచార అధికారులతో ఆర్టీఐ యాక్ట్ అమలు చేయు విధి విధానాలపై క్షుణ్ణంగా పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
మెదక్ జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ముఖ్య కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర కమిషనర్లు పీవీ.శ్రీనివాస్, బోరెడ్డి, అయోధ్య రెడ్డి, మోసిన్ పర్వీన్, వైష్ణవి మేర్ల, దేశాల భూపాల్కు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వాగతం పలికారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తదుపరి ప్రజావాణి హాలులో పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సుకు ఇతర కమిషనర్లతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టిఐ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టి మొదటిగా మెదక్ జిల్లాకు రావడం జరిగిందని, సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ శాఖల అధికారులు చూపించిన చొరవ హర్షించదగ్గ విషయం అన్నారు. అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తూఫ్రాన్ జయచంద్రారెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల పౌర సమాచార అధికారులు, పోలీస్ యంత్రాంగం, సంబంధిత సిబ్బందిపాల్గొన్నారు.