15-12-2025 07:59:36 PM
పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి..
పెద్దపల్లి (విజయక్రాంతి): మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో స్వేచ్ఛాయుతగా పోలింగ్‌కు ప్రజల సహకారం అందించాలని పెద్దపల్లి డీసీపీ రాం రెడ్డి కోరారు. పెద్దపల్లి రూరల్ పరిధిలోని రాఘవాపూర్, అప్పన్నపేట, పెద్ద కల్వల, సుల్తానాబాద్ మండలం, ఎలిగేడు, పోత్కపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించి, పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో మాట్లాడి ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు సహకరించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరడం, గొడవలు చేయడం లేదా ఉద్రిక్తత సృష్టించడం చేయరాదని, ఇతర ఓటర్లను భయపెట్టడం, ప్రభావితం చేయడం లేదా ఓటు హక్కును అడ్డుకోవడం నేరమన్నారు. మద్యం సేవించి పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం పూర్తిగా నిషేధమని, తప్పుడు ప్రచారం, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.