calender_icon.png 15 December, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను సమీక్షించిన డీఈఓ

15-12-2025 08:02:34 PM

హనుమకొండ (విజయక్రాంతి): ఈనెల 18 నుండి 20 వరకు హనుమకొండ విద్యానగర్ లోని సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్లో (టీవీ టవర్ దగ్గర) నిర్వహిస్తున్న హనుమకొండ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ సమీక్షించారు. సైన్స్ ఫెయిర్ ను విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసిన వివిధ కమిటీల కన్వీనర్లు, కో- కన్వీనర్లు, మెంబర్ల ను ఉద్దేశించి సైన్స్ ఫెయిర్ జరిగే సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్లో జిల్లా సైన్స్ అధికారి ఎన్.శ్రీనివాస స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ నిర్వహణకు సమయం తక్కువగా ఉన్నా, ఎన్నికల విధుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తలమునకలై ఉన్నా కూడా వివిధ కమిటీల ఆధ్వర్యంలో తమకు కేటాయించిన విధులు నిర్వహించి సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల నుండి ఎక్కువమంది విద్యార్థులు సైన్స్ ఫెయిర్ ను సందర్శించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వివిధ పాఠశాలల నుండి విద్యార్థులను సైన్స్ ఫెయిర్ కు తీసుకువచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 19వ తారీకు ఉదయం హనుమకొండ, హసన్ పర్తి, ఆత్మకూరు మండలాల పాఠశాల విద్యార్థులను, అదేరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పరకాల, శాయంపేట, భీమదేవరపల్లి, వేలేరు మండలాల విద్యార్థులను, 20వ తారీకు శనివారం ఉదయం కమలాపురం, ఎలుకతుర్తి, నడికుడ మండలాల విద్యార్థులను, అదే రోజు మధ్యాహ్నం దామెర, ధర్మసాగర్, కాజీపేట, ఐనవోలు మండలాల విద్యార్థులను జిల్లా సైన్స్ ఫెయిర్ సందర్శనకు తీసుకురావాలని ఆయన కోరారు. 

ఈ సమావేశంలో సెయింట్ పీటర్స్ విద్యాసంస్థల అధినేత నారాయణరెడ్డి, వడుప్సా ప్రతినిధులతో పాటు హనుమకొండ ఎంఈఓ నెహ్రు నాయక్, హసన్ పర్తి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, కాజీపేట ఎంఈఓ మనోజ్ కుమార్, సీఎంఓ బద్దం సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి సైన్స్ ఫెయిర్ జరగనున్న సెయింట్ పీటర్స్ విద్యాసంస్థల భవనాలను పరిశీలించారు.