21-11-2025 12:00:00 AM
వనపర్తి, నవంబర్ 20 ( విజయక్రాంతి ) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇబ్బందులు కల్పించకుండా కొనుగోలు చేసి డబ్బులు త్వరగా అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం ఉదయం వనపర్తి జిల్లా ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి వరి కొనుగోలు పై ఐ.కే.పి., సహకార సంఘం కొనుగోలు కేంద్రాల యజమానులు, రైస్ మిల్లర్లు, ఎపియం లతో సమీక్ష నిర్వహించారు.
రైతులు వడ్లు కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చినప్పుడు 17 శాతం తేమ శాతం , తాలు, మట్టి లేకుండా చూసుకొని తూకం చేసి అక్కడే రైతుకు రషీదు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదని, రైతులు రైస్ మిల్లు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు నుండి వడ్లు కొన్న వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసి రైతుకు రసీదు ఇవ్వాలనీ, ట్యాబ్ ఎంట్రీ చేయకుండా వడ్లు లారీ ఎక్కించవద్దని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.
10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వడానికి ఇబ్బందలేమున్నాయి ః ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
మిగతా రాష్ట్రాల్లో మిల్లర్లు వంద శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తున్నారని, ఇక్కడ కేవలం 10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వడానికి ఇబ్బందులు ఏమున్నాయని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మిల్లర్లను ప్రశ్నించారు. వెంటనే మిల్లర్లు అందరూ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ధాన్యం దించుకోవాలి, ఇతర జిల్లాకు ధాన్యం వెళ్లకుండా చూ డాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో కొనుగోలు చేసిన దొడ్డు వడ్లు వారం రోజుల నుంచి కొనుగోలు కేంద్రం నుండి తరలించడం లేదని రైతులు తన దృష్టికి తెచ్చారని, కొనుగోలు చేసిన దొడ్డు వడ్లు యుద్ధప్రాతిపదికన మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి పేద మహిళకు ఇందిరమ్మ చీరలు ఇవ్వాలి
ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రజా ప్రభుత్వం 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి పేద మహిళకు ఒక ఇందిరమ్మ చీరను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, మండలాల వారిగా షెడ్యూలు చేసుకొని ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేస్తూ చీరల పంపిణీ కార్యక్రమం సజావుగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ పి. శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమోదిని, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఎపీఎం లు, ఎ ఈ ఓ లు, తదితరులు పాల్గొన్నారు.