calender_icon.png 26 August, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అసెంబ్లీ ఎదుట పీవైఎల్ ధర్నా

16-12-2024 03:51:54 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని, తెలంగాణలో అడ్డాగా మారిన డ్రగ్స్, గంజాయి తదితర మాదకద్రవ్యాలతో పాటు మద్యాన్ని పూర్తిగా నిషేదించాలని ప్రగతిశీల యువజన సంఘం (పి.వై.ఎల్) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లలో డాక్టర్స్, నర్సు, శానిటరీ పోస్టులను భర్తీచేసి, అన్నిరకాల వ్యాధులకు వైద్యం అందించాలని, మందులు, టెస్టులు, ష్కానింగ్ లను అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టాలని, ఫీజుల వివరాలు నోటిస్ బోర్డులో పొందుపర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో చర్చించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించారు. 

ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య  తోపులాట జరగడంతో అరెస్ట్ చేసి బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇందూరు సాగర్, రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి కార్యదర్శి కోలా లక్ష్మీ నారాయణలు  మాట్లాడుతూ... ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎండమావిలా మారాయన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నిర్బంధం కొనసాగించిందని. ఫలితంగా ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్దిచేప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారని అన్నారు. కాంగ్రెస్ కూడా గత ప్రభుత్వo అనుసరించిన విధానాలనే అనుసరిస్తున్నదని అన్నారు.  ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయలేదని, గత పాలకులు వేసిన నోటిఫికేషన్ సంవత్సరం కాలంలో కేవలం 30వేల పోస్టులను మాత్రమే భర్తీ చేశారన్నారు.

ఇంకా రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటి అన్నిటికీ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి  ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, దీనిపై అసెంబ్లీ లో చర్చ జరిపి తీర్మానం చేయాలని, అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సం,, రానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన హామీ నీటిబుడగలా మారిందని ఎద్దేవాచేశారు.     రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, కొకైన్, హెరాయిన్, మాదకద్రవ్యాలు,  మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని, 90 శాతం మంది యువత వీటి మూలంగా జీవితాలను కోల్పోతున్నారని, డ్రగ్స్, గంజాయి, మద్యం అమ్మకాలలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని అన్నారు. హింసను ప్రేరేపించే మత్తు పదార్థాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, అన్నిరకాల మందులు, టెస్టులు, ష్కానింగ్ లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ తారాస్థాయికి చేరుకుందని, వీటిని అడ్డుకోవడంలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. వెంటనే నిబంధనలకు విరుద్ధంగా ప్రజలను పీల్చి పిప్పిచేసే ప్రైవేటు, కార్పొరేటు  హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి హాస్పిటల్ ల్లో ఫీజులు వివరాలను నోటిస్ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వనమాల సత్యం, గొర్రెపాటి రమేష్, సహాయ కార్యదర్శులు పర్షిక రవి, బేజాడి కుమార్, కోశాధికారి ధరావత్ రవి, రాష్ట్ర నాయకులు బండమీద నర్సయ్య, ఆంజనేయులు గౌడ్, ఉమాశంకర్, నాయకులు పగడాల శివ, బండి రవి, షేక్ షబ్బీర్, భాస్కర్, ఆంగోత్ లాలు నాయక్, డి శంకర్, ఎస్.సుధాకర్, అరుణ్ కుమార్, పి. నర్సింహా,పవన్, హైదరాబాద్ నగర నాయకులు వేణు తదితరులు పాల్గొన్నారు.