calender_icon.png 26 August, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"స్వదేశీ జాగరణ మంచ్" ఆధ్వర్యంలో బోడుప్పల్ లో భారీ ర్యాలీ

25-08-2025 11:20:59 PM

స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం, విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం

స్వదేశీ జాగరణ మంచ్ మహిళా రాష్ట్ర కో- కన్వీనర్, స్వప్న బల్ల

మేడిపల్లి: స్వదేశీ ఉత్పత్తుల వినియోగం కూడా దేశసేవలో ఒక భాగమని "స్వదేశీ జాగరణ మంచ్" ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువులను వినియోగించాలని కోరుతూ బోడుప్పల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వదేశీ జాగరణ మంచ్ స్టేట్ కో-కన్వీనర్ సిద్ధుల అశోక్, స్వదేశీ జాగరణ మంచ్ మహిళా రాష్ట్ర కో- కన్వీనర్ స్వప్న బల్ల మాట్లాడుతూ... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వదేశీ మంచ్ స్వాగతిస్తుందని తెలిపారు. 1991లో స్వదేశీ జాగరణ మంచ్ స్థాపించినప్పటి నుండి స్వదేశీ భావజాలాన్ని ప్రజల్లో నాటుతూ, ఆచరణలోకి తీసుకురావడానికి నిరంతర కృషి చేస్తుందని స్వదేశీ, స్వావలంబనలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ద్వారానే భారతదేశం శాశ్వత అభివృద్ధి సాధించగలమని,

స్వదేశీ జాగరణ మంచ్ యొక్క సంపూర్ణ విశ్వాసం అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న ఈ  సమయంలో వ్యాపార మార్గాలు,చెల్లింపు విధానాలు,కరెన్సీలు ఆయుధాలుగా మారుతున్నాయి.అమెరికా,పాశ్చాత్య దేశాలు రక్షణాత్మక విధానాలు అవలంబిస్తూ అధిక పన్నులు, అన్యాయపూర్వక అడ్డంకులతో ప్రపంచ ఎగుమతులను అడ్డుకుంటున్నాయి. మరోవైపు చైనా వంటి దేశాలు అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించి అతి తక్కువ ధరలో,నాసిరకం వస్తువులను డంప్ చేస్తూ,మన తయారీ రంగాన్ని బలహీనపరుస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశీ ఆచరణ మన జాతీయ ప్రయోజనాలను కాపాడే ప్రధాన ఆయుధం,విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం ముఖ్యంగా చైనా,టర్కీ వంటి శత్రుత్వ దేశాల వస్తువులు,సేవలను బహిష్కరించడం,విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకు బదులుగా భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం,స్థానిక ఉత్పత్తులు ప్రోత్సహించడం వంటి చర్యలు అవసరం. ఇవి దేశ ఆర్థిక శక్తిని పెంచి,స్థానిక ఉపాధి, వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.

జూన్ 12, 2025న, వ్యాపార, పరిశ్రమ, సామాజిక సంస్థల సహకారంతో ప్రారంభించిన ‘స్వదేశీ సురక్షా ఔర్ స్వావలంబన్ అభియాన్’ ద్వారా స్వదేశీ ఉద్యమానికి దేశవ్యాప్తంగా కొత్త ఊపు వచ్చింది.చైనా తో మన వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఆందోళనకరం.మన సైనికులు సరిహద్దులో కాపలా కాస్తున్నప్పుడు, మనం శత్రువుల ఖజానాను నింపడం సరైందా అని ఆలోచించాలి..?

అమెజాన్,వాల్‌మార్ట్ (ఫ్లిప్‌కార్ట్) వంటి పాశ్చాత్య ఈ-కామర్స్ దిగ్గజాలు 21వ శతాబ్దపు ఈస్ట్ ఇండియా కంపెనీలుగా మారాయి.ఇవి చిన్న వ్యాపారులను కిందికి నెడుతూ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి.ఈ-కామర్స్ మోనోపోలీలపై నియంత్రణ పీడన ధరలు, ప్రిఫర్డ్ సెల్లర్స్ విధానం,స్వంత బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయడం అవసరం.ప్రతి భారతీయుడు ‘స్వదేశీ సురక్షా ఔర్ స్వావలంబన్ అభియాన్’ లో భాగమై,స్వదేశీ ఆచరణతో భారతాన్ని మళ్లీ మహోన్నత దేశంగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని స్వీకరించాలన్నారు.ఈ ర్యాలీలో సుమారు 500 పైగా విద్యార్థులు పాల్గొన్నారు.