25-08-2025 11:39:54 PM
చేవెళ్ల: తండ్రిని చంపిన కొడుకును పోలీసులు రిమాండ్ కు తరలించారు. సీఐ పవన్ కుమార్ రెడ్డి వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ముర్తుజాగూడ కు చెందిన మహమ్మద్ అజ్జు ఖాన్ (50) కూలీ పనులు చేసేవాడు. అయితే మద్యానికి బానిసైన ఇతను కొందరి దగ్గర డబ్బులు తీసుకొని పనికి వెళ్లడం లేదు. ఆగస్టు 6వ తేదీన ఉదయం మరికొందరితో కలిసి వార్డులోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో కూర్చున్నాడు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తి అతని వద్దకు వెళ్లి డబ్బులు తీసుకొని పనికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించాడు.
అజ్జు ఖాన్ భార్య కూడా ఇలా ఎందుకు చేస్తున్నావని నిలదీసింది. గమనించిన అజ్జుఖాన్ కొడుకు అజీమ్ ఖాన్ అక్కడికి వెళ్లి మందు తాగి అందరితో గొడవ పడతున్నాడనే కోపంతో పక్కనున్న వ్యక్తి నుంచి వాకింగ్ స్టిక్ ను లాక్కొని తండ్రిని విచక్షణా రహితంగా కొట్టాడు. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో భార్య , కుటుంబ సభ్యులు భాస్కర్ హాస్పిటల్‌కు , అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ. 14న మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం అజీమ్ ఖాన్ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి.. రిమాండ్ కు తరలించారు.