03-07-2025 01:38:02 AM
వాషింగ్టన్, జూలై 2: భారత్‌కు దౌత్యపరంగా భారీ విజయం లభించింది. వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన క్వాడ్ దేశాల (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) విదేశాంగ మంత్రుల సమావేశంలో పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు క్వాడ్ ప్రతినిధులు ఓ సంయుక్త పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఉగ్రదాడి బాధ్యులను తక్షణమే, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని క్వాడ్ దేశాల విదేశాంగమంత్రులు కోరారు.
ఉగ్రవాద చర్యలు, హింసాత్మక తీవ్రవాదం, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు క్వాడ్ దేశాలు స్పష్టం చేశాయి. వాషింగ్టన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. పహల్గామ్ దాడి అత్యంత హేయమైన చర్య అని, ఈ దాడికి కారకులైన సూత్రధారులను, వారికి సహకరించిన వారిని, నిధులు సమకూర్చిన వారిని తక్షణమే చట్టం ముందు నిలబెట్టాలని క్వాడ్ మంత్రులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
సమావేశం అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశం అయ్యారు. వాణిజ్యం, భద్రత, టెక్నాలజీ, కనెక్టివిటీ, పవర్ రంగాలపై, భారత్-అమెరికా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.