03-07-2025 01:40:22 AM
బీజింగ్, జూలై 2: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మే 21 నుంచి జూన్ 5 వరకు దాదాపు 15 రోజుల పాటు కనిపించకుండా పోయాడనే వార్తలు కలకలం రేపుతున్నాయి. అంతే కాకుండా ఇటీవల జిన్‌పింగ్‌కు సన్నిహితంగా ఉన్న జనరల్స్ వరుసగా ఉద్వాసనకు గురవుతున్నారు. దీంతో చైనాకు తదుపరి అధ్యక్షుడిగా టెక్నోక్రాట్ అయిన వాంగ్ యాంగ్ నియమితుడవుతాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జిన్‌పింగ్ ఇలా కనిపించకుండా పోవడం ఇదే తొలిసారి కాదు. ఇది సాధారణమే అని నిఘా సంస్థలు చెబుతున్నాయి. చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షులను పక్కనపెట్టడం మామూలేననే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జూలై 5-8 వరకు బ్రెజిల్‌లోని రియోడీజనీరోలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకావడం లేదని..
అతడి గైర్హాజరీలో ప్రీమియర్ లీ కియాంగ్ ఈ సదస్సుకు హాజరు కానున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం వెల్లడించారు. జిన్‌పింగ్ అధికారం చేపట్టిన 12 ఏండ్లలో బ్రిక్స్ సదస్సుకు హాజరు కాకుండా ఉండటం ఇదే తొలిసారి. బ్రిక్స్ కూటమిలో భారత్ కూడా సభ్యదేశమే.
భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇరువురూ భేటీ అయ్యారు. ఈ సారి బ్రిక్స్ సమావేశాలకు జిన్‌పింగ్ దూరంగా ఉండటంతో వీరివురి భేటీ లేనట్లే.
కొత్త అధ్యక్షుడిగా వాంగ్ యాంగ్?
చైనాలో అధ్యక్ష మార్పు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడ ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం తారా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్ పదవి కోల్పోయి అతడి స్థానంలో టెక్నోక్రాట్ అయిన వాంగ్ యాంగ్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపడతారని చర్చ నడుస్తోంది. ఇటీవల అక్కడ జిన్‌పింగ్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో జిన్‌పింగ్ ఉద్వాసన కూడా తథ్యం అని అంతా అంటున్నారు.