22-05-2025 12:00:00 AM
ఆదిలాబాద్, మే 21 (విజయక్రాంతి): అదిలాబాద్ రూరల్‌లో కలెక్టర్ రాజర్షి షా సుడిగాలి పర్యటన చేశారు. మారుమూల చిట్యాల్ బోరీ గ్రామంలో జరుగుతున్న ఉపా ధి హామీ పనులను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫారెస్టులో జరుగుతున్న ఉపాధి హామీ పనుల ప్రాంతానికి 2 కిలోమీటర్ల వరకు కలెక్టర్ ద్విచక్ర వాహనంపై వెళ్లి పనులను పరిశీలించారు.
ఉపాధి హామీ పనుల్లో భాగంగా చేపడుతున్న సీసీటీ, పెబల్ బండింగ్, నర్సరీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీసి, రికార్డులను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలం నేపథ్యంలో కూలీలకు ఎండ నుండి రక్షణ కల్పించేందు ఏర్పాట్లు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
కచికంటి గ్రామంలోని ఇంట్లో వ్యక్తిగత ఇంకుడు గుంత నిర్మాణ పనులు, అంగన్వాడి కేంద్రంలో టాయిలెట్స్ నిర్మాణ పనులను తనిఖీ చేశా రు. ఉపాధి హామీ పనుల నాణ్యతను మెరుగుపరచాలని ఆన్నారు. పనులు సక్రమంగా జరగడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుతుందని, ప్రజల జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు. నర్సరీలో నాటిన మొక్కలకు ఉదయం, సాయంత్రం నీళ్లు పోసి, మొక్కలను బతికించాలని సూచించారు.
ఈ ఏడాది సాధ్యమైనంతా తొందర గా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఇవి ఇంటి పైకప్పు మీద పడే వర్షపు నీటిని భూమిలోకి ఇంకిపోయేలా చేస్తాయని, ఇంకుడు గుంతల తో భూగర్భ జలాలు పెరుగడం తోపాటు బోర్లు ఎండిపోకుండా ఉంటాయని, వర్షపు నీరు వృథా కాకుండా ఉంటుందన్నారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ రవీందర్, ఎంపిడిఓ నాగేశ్వర్ రావు, సిబ్బంది ఉన్నారు.