ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్?
ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఘటన
మహబూబాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): సీనియర్ విద్యార్థుల వేధింపులు తాళలేక ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబా బాద్ జిల్లాలో శనివారం జరిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేం ద్రంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఈసం రితిక్ ఆరో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు రితిక్‌ను ర్యాగింగ్ చేయడంతోపాటు కొట్టినట్టు తెలిసింది.
దీంతో మనస్థాపానికి గురైన రితిక్ శనివారం ఉదయం ఎలర్జీ లోషన్ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడిని గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
హాస్టల్ వర్కర్ల ఇష్టారాజ్యం
హాస్టల్ వార్డెన్ హాస్టల్‌లో ఉండకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా రాత్రి పూట విద్యార్థులను అందులో పనిచేసే వర్కర్లు బయటకు తీసుకెళ్లి, ఇతర పనులు చేయిస్తున్నట్టు సమాచారం. విద్యార్థులకు భోజనం కూడా సరిగా పెట్టడంలేదని తెలుస్తున్నది. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై పైతరగతి విద్యార్థులతో దాడులు చేయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.




