25-08-2025 12:39:43 AM
జిల్లా ఎస్పీ డి. జానకి
మహబూబ్ నగర్ ఆగస్టు 24 (విజయ క్రాంతి) : విద్యాసంస్థల్లో రాగింగ్ చేసే విద్యార్థులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి జానకి స్పష్టం చేశారు.కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో రాగింగ్ ఒక తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. రాగింగ్లో పాల్గొనే విద్యార్థులు తక్షణమే కాలేజీ నుండి బహిష్కరణకు గురవుతన్నారు. అధనంగా క్రిమినల్ కేసులు నమోదై వారి విద్య, ఉద్యోగ, భవిష్యత్తు అవకాశాలు ప్రభావితమవుతాయని హెచ్చరించారు.
ప్రతి ఉన్నత విద్యాసంస్థలో యాంటీ రాగింగ్ కమిటీలు, స్క్వాడ్లు ఏర్పాటు చేయాలి. కొత్త విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, నిరంతరంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేయడానికి 24/7 హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రాగింగ్ విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాదు, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు కలిసి రాగింగ్ను పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.