calender_icon.png 25 August, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలానికి తగ్గిన వరద

25-08-2025 12:39:36 AM

10 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల

నాగర్‌కర్నూల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలానికి వరద తీవ్రత కొంత మేరకు తగ్గింది. జూరాల-సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 4,65,420 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. 885 అడుగులు, 215 టీఎంసీల సామర్థ్యం గల శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులు, 195.6605 టీఎంసీల వద్ద నీటి నిల్వ కొనసాగుతోంది. అధికారులు 10 గేట్ల ను 16 ఫీట్ల మేర ఎత్తి 3,80, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

సాగర్ 26 గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జునసాగర్(విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి 4,16,401 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 297.1465టీఎంసీలుగా ఉంది. దీంతో నాగార్జున సాగర్ 26 గేట్ల నుంచి దిగువకు అధికారులు నీటిని వదులుతున్నారు. సాగర్ వద్ద కృష్ణమ్మ సోయగాలను చూసేందుకు పర్యాటకులు ఆదివారం పోటెత్తారు.  రోడ్లపై ఎక్కడ చూసినా వాహనాలే దర్శనమిస్తున్నాయి. 

నిండుకుండలా ఎస్సారెస్పీ 

అర్మూర్(విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండికుండలా మారింది. ఎగువ ప్రాంతమైన  మహారాష్ర్టలో, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 80 టీఎంసీల సామర్థ్యం కలదు. ప్రాజెక్టులోకి 131 టీఎంసీల వరద నీరు వచ్చింది. వరద గేట్ల ద్వారా సుమారు 48 టీఎంసీల నీటిని 16 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.