19-05-2025 01:40:33 AM
హైదరాబాద్ చార్మినార్ సమీపంలో ఘటన
మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులే..
- శ్రమకోర్చి మంటలు ఆర్పేసిన అగ్నిమాపక, హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది
-అడ్డంకిగా ఇరుకైన ప్రవేశ ద్వారం.. గోడలు బద్దలుకొట్టుకుని లోపలికి ప్రవేశం
-రెస్క్యూను పర్యవేక్షించిన మంత్రి పొన్నం..బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి కాల్
-మృతుల కుటుంబాలకు రాష్ట్రం ౫ లక్షలు, కేంద్రం ౨ లక్షల చొప్పున పరిహారం
హైదరాబాద్ పాతబస్తీ.. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం ఉదయం సంభవించిన అగ్నిప్రమాదం ౧౭ మంది ప్రాణాలను ఆహుతి చేసింది. బాధిత కుటుంబాలకు పెనువిషాదాన్ని మిగిల్చింది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులే కావడం హృదయ విదారకమైన విషయం. పసిమొగ్గల జీవితాలు విరియకుండానే రాలిపోయాయి.
ముత్యాల అమ్మకాలకు కేరాఫ్.. దశాబ్దాల క్రితం అక్కడే స్థిరపడిన కుటుంబం. వేసవి సెలవులు కావడంతో దూరప్రాంతాల నుంచి పిల్లాపాపలతో బంధువుల ఆగమనం. ఇల్లంతా సందడి. ఆ రాత్రి పెద్దాచిన్నా అంతా సరదాగా గడిపారు. రోజూలాగే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.
గాఢనిద్రలో ఉండగా ఉదయాన్నే మృత్యువు షార్ట్సర్క్యూట్ రూపంలో వచ్చింది. ఒక్కసారిగా మంటలు.. భవనాన్ని చుట్టుముట్టిన దట్టమైన పొగలు.. ఆ కుటుంబం తేరుకునేందుకు సమయం లేకుండాపోయింది. చుట్టూ హాహాకారాలు.. ఆక్రందనలు.. అగ్నిమాపకశాఖ, హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగప్రవేశం. 10కిపైగా ఫైరింజిన్లు, ఒక రోబో. కొన్ని గంటల పాటు శ్రమ. భవనం ఇరుకైన ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళ్లేందుకు ఆస్కారమే లేదు. చివరకు గోడలు బద్దలు కొట్టుకొని, భవనానికి నిచ్చెనలు వేసుకుని మరీ గదుల్లోకి రెస్క్యూబృందం ప్రవేశం. ఎగసిపడుతున్న మంటలు అప్పటికే ముగ్గురి ప్రాణాలను కబళించాయి. దట్టమైన పొగలకు ఊపిరాడక మరో 14 ప్రాణాలూ బలయ్యాయి.
-గుల్జార్ హౌస్ వద్ద భారీ అగ్నిప్రమాదం
-హైదరాబాద్ చార్మినార్ సమీపంలో దుర్ఘటన
రంగారెడ్డి, /చార్మినార్, మే 18 (విజయక్రాంతి): హైదరాబాద్ చార్మినార్ సమీపం లోని గుల్జార్‌హౌస్‌లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని వ్యాపించాయి. భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.
మరో 14 మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇలా అగ్నిప్ర మాదంలో మొత్తం 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎనిమిది చిన్నారులే కావడం అత్యంత విషాదకరమైన విషయం. మిగిలిన మృతుల్లో ఐదుగురు మహిళలు కా గా, నలుగురు పురుషులు. అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుల్జార్ హౌస్ భవన సముదాయంలో కొంతకాలం నుంచి ఆభరణాల వ్యాపారులు వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో నగల దుకాణం ఉండగా, పై అంతస్థులో ఆయా కుటుంబాలు నివసిస్తున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో వ్యాపా రుల ఇంటికి బంధువులతో పాటు వారి పిల్లలు సైతం వచ్చారు. వీరంతా సుమారు 30 మంది వరకు ఉన్నారు. శనివారం రాత్రి వారంతా భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.
ఆదివారం తెల్లవారుజామున భవ నంలోని ఏసీ కంప్రెషర్ పేలి షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. భవనంతోపాటు చుట్టుప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భవనంలో ఉన్న వారంతా గాఢ నిద్రలో ఉండడంతో వారు త్వరగా ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వారు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.
70 మంది ఫైర్ సిబ్బంది 10కి పైగా ఫైరింజన్లను ఘటనా స్థలానికి తీసుకువచ్చి, కొద్ది గంటలపాటు శ్రమించి మంటలు ఆర్పేశారు. మంటలు ఆర్పేందుకు ప్రత్యేకంగా ఒక రోబో యంత్రాన్ని సైతం వినియోగించారు. ఘటనా స్థలంలోనే వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోవడం, భవనం లోపలికి వెళ్లేందుకు ఇరుకుగా ఉండటంతో రెస్క్యూ బృం దాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు ఇంటి గోడలను పగులగొట్టి, నిచ్చెన సా యంతో మొదటి అంతస్తులోకి చేరుకోవాల్సి వచ్చింది.
అప్పటికే ముగ్గురు మంటల్లో సజీవ దహనమయ్యారు. ఘటనలో స్పృహతప్పి పడిపోయిన వారిని, అస్వస్థతకు గురైన వారిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వారిని వెంటనే కంచన్‌బాగ్ డీఆర్‌డీవో, అపోలో, మలక్‌పేట యశోద ఆసుపత్రులకు తరలించారు.
క్షతగాత్రుల్లో చికిత్స పొందుతూ 14 మంది మృత్యువాత పడ్డారు. మృతులను రాజేందర్ మోడీ (65), మున్ని (70), అభిషేక్ (31), ప్రహ్లాద్ (70), సుమిత్ర (60), శీతల్ (35), పంకజ్ (36), అభిషేక్ (31), రజిని (32), వర్ష (35), ప్రియాన్ష్(4), హమేయ్ (7), ఇరాజ్ (2), అనుయాన్ (3), ఆరూష్ (3), రిషబ్ (4), ప్రథమ్ (1)గా గుర్తించారు.
రెస్క్యూలో ఫైర్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసులు..
సీఎం ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక అధికారులు, సిబ్బందికి సూచనలిస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేశారు. అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, సౌత్ జోన్ డీసీసీ స్నేహమిశ్రా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
సీఎం రేవంత్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి మనోధైర్యాన్నిచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపకశాఖ, అధికారులు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భవనం మొత్తం చెక్క ప్యానెళ్లతో నిర్మించడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ఫైర్‌శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు.
అగ్నిప్రమాదంపై భవనంలో పనిచేసే కార్మికులు స్పందిస్తూ.. ‘భవనంలో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తేవని, వారంలో రెండు మూడుసార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయేదంటున్నారు. వ్యాపారులు వెంటనే స్పందించి, ముందుగానే పరిష్కారం తీసుకుంటే, ప్రమాదం సంభవించకపోయి ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్రప్రభుత్వం పరిహారం ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మం త్రులు భట్టి, రాజనర్సింహ, పొన్నం తో ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. పోస్టుమార్గం విభాగం వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారితో మాట్లాడి మనోధైర్యాన్నిచ్చారు.
షార్ట్‌సర్యూట్‌తోనే ప్రమాదం: డిప్యూటీ సీఎం భట్టి
చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్‌హౌస్‌లో షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతోనే అగ్నిప్రమాదం సంభవించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో అందుతున్న సహాయ చర్యలను సీఎం రేవంత్‌రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తు న్నారని తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 6.17 గంటలకు అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిప్రమాకశాఖకు సమాచారం అందిందని, మొఘల్‌పుర అగ్నిమాపక సిబ్బంది 6.20 గంటలకు ప్రమాదస్థలికి చేరుకున్నారని వెల్లడించారు.
సుమారు 70 మంది సిబ్బంది 11 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు రెస్క్యూలో పాల్గొన్నారని తెలిపారు. వారంతా కొన్నిగంటల పాటు శ్రమించి ప్రమాద తీవ్రత పెరగకుండా నియంత్రించగలిగారని వివరించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
గుల్జార్‌హౌజ్ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. సంఘటనా స్థలానికి వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్, అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డిని పంపించి సహాయక చర్యలను వేగవంతం చేశామన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలను చేపట్టాలన్నారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు.అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించటంతో ప్రాణనష్టం తగ్గిందని వెల్లడించారు. సిబ్బంది సుమారు 40 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని తెలిపారు.
మంటలు, పొగల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది శక్తియుక్తులు ప్రదర్శించారని వివరించారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని తెలిపారు.