04-11-2025 01:07:33 AM
పాట్నా, నవంబర్ ౩: యుమునా తీరంలో తాను భక్తిశ్రద్ధలతో చేసిన ఛఠ్‌పూజలను ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉద్దేశపూర్వకంగానే ఆ పూజలను ‘నాటకం’ అని అవమానించారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఓట్ల కోసం ఆర్జేడీ, -కాంగ్రెస్ కూటమి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన ముజఫర్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..
ఛఠ్‌పూజలు ఆత్మగౌరవానికి ప్రతీకగా అని, తమ ప్రభుత్వం ఈ పండుగకు యునెస్కో హెరిటేజ్ గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తుందన్నారు. పూజలపై రాహుల్ వ్యాఖ్యలను బీహార్‌కు చెందిన తల్లులు ఎప్పటికీ సహించరని, ఈ అవమానాన్ని వందల సంవత్సరాల పాటు బీహార్ ప్రజలు మరచిపోరని ఉద్ఘాటించారు. ఆర్జేడీ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉండేదని, నిత్యం ఏదో ఒకచోట దొంగతనాలు, కిడ్నాపులు జరిగేవని పేర్కొన్నారు.
బీహార్‌కు ఇప్పుడు ‘లాంతరు’ (ఆర్జేడీ పార్టీ గుర్తు) అవసరం లేదని పరోక్షంగా ఆర్జేడీని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ అగ్రనేత, ఆర్జేడీ నేత తేజసీ యాదవ్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న కుటుంబాల నుంచి వచ్చారని, ఇద్దరూ కుంభకోణాల కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చారని తెలిపారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి అధికారం కోసం పాకులాడుతున్నారని, బీహార్ ఎన్నికల్లో గెలిచి మరింత దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రాభివృద్ధికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, విద్యుత్తు, కనెక్టివిటీ, శాంతిభద్రతలను తమ ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పొత్తు నూనె, నీరు కలిపినట్లు ఉంటుందని, ఆ రెండు ఎప్పటికీ మిళితం కావని ఎద్దేవా చేశారు. తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్‌కు లేదని, కానీ.. కాంగ్రెస్ తలకు తుపాకీ ఎక్కుపెట్టి మరీ సీఎం అభ్యర్థిత్వాన్ని లాక్కున్నారని వ్యాఖ్యానించారు.