09-10-2025 12:06:15 AM
శాంతిస్తున్న వరణుడు...తగ్గుతున్న వరద పోటు..
నేలకొరిగిన పంటలు... కష్టాల్లో కర్షకులు.. పంట నష్టం పై లెక్కలు...
కొనసాగుతున్న వ్యాపారాలు రద్దీగా మారిన రహదారులు..
బాన్సువాడ అక్టోబర్ 8 (విజయ క్రాంతి): ఆగ్రహించిన వరణుడు కాసింత శాంతించాడు. ఎడ తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అస్తవ్యస్తమైన జనజీవనం కాస్త కుదుటపడుతోంది. గడప దాటని వ్యాపారులు ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటూ రోడ్లపైకి వస్తున్నారు. ఒక్కసారిగా స్తంభించిన క్రయవిక్రయాలు యధా విధంగా కొనసాగే వీలు ఏర్పడుతోంది.
బతుకమ్మ దసరా దీపావళి కొనుగోలుకు జనం రోడ్లపైకి రావడంతో వ్యాపార సముదాయాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. వాహనాల రాకపోకలతో రహదారులు రద్దీగా మారాయి. అతివృష్టి ధాటికి జలాశయాలు మాత్రం నిండుగా దర్శనమిస్తున్నాయి. అటు ఎస్సారెస్పీ, ఇటు నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాస్త వరదహోరు తగ్గింది. నిజాంసాగర్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
ప్రాజెక్టు ద్వారా 15 వరద గేట్లనే ఎత్తి దిగువన 1,09,470 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు అక్షయ్, సాకేతులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్ట్ లోకి ప్రాజెక్ట్ లోకి 96 వేల 057 క్యూసెక్కుల నీరు ఇన్ ప్లోగా వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1402 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు 15 వరద గేట్లను ఎత్తివేసి దిగువన1,09,059 క్యూసెక్కుల వరద నీటిని ప్రధాన కాలువల ద్వారా మంజీరా నది లోకి విడుదల చేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చెక్ డ్యాములు, రిజర్వాయర్లు, ఊర చెరువులు,కాలువలు కూడా వరద నీటితో నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఇకపోతే సాగు విషయానికొస్తే కర్షకులు మాత్రం తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంటల దిగుబడులు పూర్తిగా దెబ్బ తినడంతో ఆ పంట సాగు చేసిన రైతులు ఆర్థిక నష్టాన్ని చవిచూడక తప్పేట్టు లేదు. అలాగే ప్రతి సోయా పంట రైతులు సైతం దిగాలుతో తమ పంటలను చూసి కన్నీరు పెడుతున్నారు.
జోరుగా పడ్డ వానలతో పంటలు చినుకు దెబ్బతో నేల చూపులు చూసాయని వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు అటుంచి.. కూలీలకు ఇచ్చిన పైకం కూడా రాని పరిస్థితి ఏర్పడిందంటూ సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వరి పంట సాగు చేసుకునే రైతులు కూడా పంటల పరిస్థితిని చూసి దిగాలు చెందుతున్నారు. వాన తాకిడికి వరి పంటలు దెబ్బ తినేందుకు అవకాశం ఏర్పడిందని, ఈపుగా ఎదుగుతున్న దశలోనే వానాల ప్రభావం పంట నష్టానికి అవకాశం కల్పించినట్లు రైతులు చెబుతున్నారు.
వ్యవసాయ అధికారులు కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అడుగులు ముందుకు కదిపారు. ఏ ఏ పంటలు దెబ్బతిన్నాయి.. ఏ మేరకు నష్టం వాటిల్లింది.. అన్న అంశాలను క్రోడీకరించి పంట నష్ట పరిహారం ప్రణాళికను రూపొందించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాగా కురిసిన భారీ వర్షాల కారణంగా అన్ని రంగాల వారు కాగాఇబ్బందులు పడక తప్పలేదు.
కొందరికి ఆస్తి నష్టం వాటిల్లిన, మరికొందరికి పంట నష్టం జరిగిన, ఒక్కసారిగా వ్యాపార లావాదేవీలు నిలిచిపోయి వారం రోజులపాటు జనజీవనం స్తంభించి పోయినట్లుంది. ఇప్పుడిప్పుడే వాతావరణం సద్దుమనడంతో తమ తమ కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు వీలు ఏర్పడింది.