17-09-2025 02:05:46 PM
న్యూఢిల్లీ: 2001లో ముంబైలో జరిగిన హోటల్ వ్యాపారి జయశెట్టి హత్య(Hotelier Jaya Shetty Murder Case) కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు(Chhota Rajan) మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) బుధవారం రద్దు చేసింది. రాజన్ జీవిత ఖైదును సస్పెండ్ చేసి, ఈ కేసులో అతనికి బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 23న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం అనుమతించింది. రాజన్ 27 సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడని, నాలుగు కేసుల్లో దోషిగా నిర్ధారించబడ్డాడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
"అలాంటి వ్యక్తికి శిక్షను ఎందుకు నిలిపివేయాలి" అని ధర్మాసనం ప్రశ్నించింది. రాజన్ తరపు న్యాయవాది ఇది ఆధారాలు లేని కేసు అని వాదించారు. 71 కేసుల్లో 47 కేసుల్లో రాజన్‌కు వ్యతిరేకంగా సీబీఐ ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని, దర్యాప్తు సంస్థ వాటిని మూసివేసిందన్నారు. రాజన్ వేరే హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు విధించబడిందని రాజన్ తరపు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో రాజన్‌కు విధించిన జీవిత ఖైదును హైకోర్టు నిలిపివేసిందని సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వి రాజు అన్నారు. సెంట్రల్ ముంబైలోని గామ్‌దేవిలో గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని అయిన శెట్టిని, రాజన్ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులు హోటల్ మొదటి అంతస్తులో మే 4, 2001న కాల్చి చంపిన విషయం తెలిసిందే.