30-10-2024 12:00:00 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 4,015 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నిరుడు ఇదేకాలంలో నమోదైన రూ. 3,606 కోట్ల లాభంతో పోలిస్తే ఈ క్యూ2లో 11% వృద్ధి సాధించింది. మొత్తం ఆదాయం రూ.31,472 కోట్ల నుంచి రూ. 34,721 కోట్లకు పెరిగినట్టు మంగళవారం కెనరా బ్యాంక్ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలిపింది.
ఆస్తుల నాణ్యతకు సంబంధించి బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 4.76 శాతం నుంచి 3.73 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.41 శాతం నుంచి 0.99 శాతానికి మెరుగుపడ్డాయి.
త్వరలో కెనరా ఏఎంసి ఆఫర్
తమ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) కెనరా రొబెకో ప్రతిపాదించిన పబ్లిక్ ఆఫర్‌కు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి త్వరలో లభిస్తుందని కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో కెనరా బ్యాంక్‌కు 51 శాతం వాటా ఉన్నది. ఇందులో 13 శాతం వాటాను విక్రయించాలని బ్యాంక్ భావిస్తున్నది.